దూకుడు పెంచిన తెలంగాణ టీడీపీ.. కీలక కమిటీని నియమించిన చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నిరసనలకు సిద్ధమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై గళం పెంచాలని భావిస్తుంది.

Update: 2023-08-28 13:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ నిరసనలకు సిద్ధమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై గళం పెంచాలని భావిస్తుంది. అందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. అందుకు అధికారులకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు అధికారులకు వినతులు అందజేయాలని పార్టీ నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి రాష్ట్ర నేతలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ.. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ మండల స్థాయి నుంచి అధికారులకు వినతి పత్రాలు అందజేయాలన్నారు. దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, మహిళలు, యువత, పేదలకు ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బస్సుయాత్రను చేపట్టాలని ఆలోచిస్తున్నామని, మండల, డివిజన్, పట్టణ కమిటీలను పూర్తి చేయాలని నేతలను ఆదేశించారు. పార్టీకోసం పనిచేసేవారికే గుర్తింపు ఇస్తామని ప్రకటించారు.

ఏడుగురితో కమిటీ

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీడీపీ ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపికకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, నాయకులు నర్సిరెడ్డి, కాశీనాథ్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపేవారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన తర్వాత ఈ కమిటీ చంద్రబాబునాయుడికి నివేదికను అందజేయనున్నారు. దాని ఆధారంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, ప్రకటన చేయనున్నారు.

Tags:    

Similar News