BRS: నయా స్ట్రాటజీ.. ఇకపై ఆ పార్టీ టార్గెట్‌గా విమర్శల ఎటాక్..!
రాష్ట్రంలో మొన్నటివరకు ముక్కోణపు పోటీ ఉంటుందని ఆశించిన బీఆర్ఎస్ లీడర్లకు ప్రస్తుతం మింగుడు పడని పరిస్థితి నెలకొంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొన్నటివరకు ముక్కోణపు పోటీ ఉంటుందని ఆశించిన బీఆర్ఎస్ లీడర్లకు ప్రస్తుతం మింగుడు పడని పరిస్థితి నెలకొంది.కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరగడంతో బీజేపీ పోటీలో లేకుండా పోతుందని అందోళన పట్టుకుంది. ద్విముఖ పోటీతో తమకు నష్టమనే అభిప్రాయంలో గులాబీ లీడర్లు ఉన్నారు. రాజకీయంగా మేలు జరగాలంటే త్రిముఖ పోటీ ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం బీజేపీకి బూస్టింగ్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
వ్యతిరేకత ఓట్లు చీలితే మేలు
పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. ఈ వ్యతిరేకత ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉంది. ఆర్బన్ ఏరియాల్లో తీవ్రంగా, రూరల్ ఏరియాలో మధ్యస్తంగా ఉంది. ఇంతకాలం బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి. కానీ కర్ణాటక రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు హస్తం గూటికి చేరారు.
దీనికి తోడు కొన్ని రోజులుగా బీజేపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు సైతం కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్కు ప్రత్యామ్నయం అనే చర్చ జరుగుతున్నది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఉంటే కాంగ్రెస్‌కు మైలేజ్ వచ్చే ప్రమాదం ఉందని, అలా కాకుండా పోటీలో బీజేపీ సైతం ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోయి తమ విజయం ఈజీగా అవుతుందని బీఆర్ఎస్ లీడర్లు అంచనా వేస్తున్నారు.
ప్రధాని టూర్ తర్వాత స్ట్రాటజీ చేంజ్..?
బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్‌గా మారిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. అందుకే రెండు పార్టీల మధ్య పరస్పరం విమర్శలు లేవని గుర్తుచేస్తున్నది. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణ, మంత్రులు, ఎంపీలపై ఈడీ, ఐటీ సోదాలు లేవని ఆరోపిస్తున్నది. రేపు(ఈనెల 8న) ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు వస్తున్నారు. ఆ పర్యటనలో కేసీఆర్‌పై ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారని ఆసక్తి నెలకొంది.
వరంగల్ సభలో మోడీ ప్రసంగం తర్వాత కేసీఆర్ బీజేపీపై రాజకీయ వ్యూహాన్ని మార్చే అవకాశం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ పోటీలో ఉండి ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్, జేడీఎస్ మధ్య చీలిపోయి బీజేపీకి ప్లస్ అయ్యేదని లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ కోసం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ పోటీలో ఉండే విధంగా సీఎం కేసీఆర్ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రయోగిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్.