బీఆర్ఎస్‌కు ఈసారి అంత ఈజీ కాదు.. తలనొప్పంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే?
అధికార బీఆర్ఎస్ పార్టీ ఈసారి రాష్ట్రంలో ఏటికి ఎదురీదుతున్నది. గత ఎన్నికల తరహాలో నల్లేరు మీద నడకలా లేదు.
దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీ ఈసారి రాష్ట్రంలో ఏటికి ఎదురీదుతున్నది. గత ఎన్నికల తరహాలో నల్లేరు మీద నడకలా లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న సర్వేలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహారశైలే కారణమని వెల్లడైంది. ప్రభుత్వ పథకాలపైనా పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఎమ్మెల్యేలతో పాటు స్థానిక పార్టీ లీడర్ల ఓవరాక్షన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
స్కీముల్లో వారిదే పెత్తనం..
ప్రభుత్వ పథకాల అమలులో వారిదే పెత్తనమవుతున్నదని, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సర్వేలో తేలింది. రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు మొదలు కల్యాణలక్ష్మి, దళితబంధు తదితర పథకాలకూ ఎమ్మెల్యేల మాటే ఫైనల్ అవుతున్నదని, వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని వాపోయారు. వారి సహాయకులు, అనుచరులు, స్థానిక నేతలు అజమాయిషీతోపాటు కిందిస్థాయి సిబ్బంది లంచాలిస్తేనే దరఖాస్తులను ఓకే చేస్తున్నారన్న ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. దళితబంధు విషయంలో ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్ తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లు జనంలోకి విస్తృతంగా వెళ్లాయి.
అడ్డుకుంటున్న ప్రజలు...
ఈ సర్వేలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు తగినట్లుగానే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకున్నారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, డోర్నకల్‌లో రెడ్యానాయక్, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, అచ్చంపేటలో గువ్వల బాలరాజు, మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, ఆందోల్‌లో క్రాంతికిరణ్, జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆలంపూర్‌లో అబ్రహం, హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీత, పరిగిలో మహేశ్వర్‌రెడ్డి, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, చొప్పదండిలో రసమయి బాలకిషన్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్‌లను ప్రజలు అడ్డుకున్నారు.
సమస్యలను పట్టించుకోవడం లేదనే..
ప్రజలను పట్టించుకోకుండా వారి సొంత అవసరాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్న భావన ప్రజల్లో ఉంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా సొంత నియోజకవర్గంలో ఇదే తరహా చేదు అనుభవం ఎదురైంది. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ వేధింపులతో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం తదితరాలన్నీ అధికార పార్టీ ఆగడాల కోవలోకి చెందినవి.
మరోసారి ఓటు వేయలేం..
సిట్టింగ్‌లందరికీ ఈసారి టికెట్లు ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై గ్రామీణ ప్రజానీకం ఉడికిపోతున్నారు. ఇప్పటికే వారి చర్యలు శృతిమించిపోయాయని, మరోసారి ఎమ్మెల్యే అయితే వారికి హద్దూ అదుపు ఉండదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోసారి వారికి ఓటు వేసే ప్రసక్తే లేదని సర్వే సందర్భంగా ముఖంమీదనే చెప్పారని అధ్యయనంలో పాల్గొన్నవారి ద్వారా తెలిసింది. ఏ అవసరానికైనా గతంలో అధికారుల దగ్గరికి వెళ్లేవారమని, ఇప్పుడు అక్కడ దరఖాస్తు ఇచ్చినా ఎమ్మెల్యే చెప్పిన తర్వాతనే ఫైనల్ అవుతున్నదనే స్వీయానుభవాలను వివరించారు. సమస్యలను చెప్పుకునే మార్గం కూడా లేకుండాపోయిందని, ఎమ్మెల్యేలకంటే వారి చుట్టూ తిరిగే కోటరీయే చక్రం తిప్పుతున్నారని పేర్కొన్నారు.
సర్వేలో విస్తుపోయే అంశాలు..
ఒకవైపు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని, కర్ణాటక రిజల్ట్ తర్వాత రాష్ట్రంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్న టైమ్‌లో ఢిల్లీకి చెందిన సర్వే సంస్థలో విస్తుపోయే అంశాలు వెల్లడి కావడం గమనార్హం. పూర్తిస్థాయి నివేదికలో ఇంకా ఎలాంటి వివరాలు వస్తాయో, అది పార్టీకే ఎలాంటి చిక్కులు తెస్తుందోననే కలవరం మొదలైంది. ఎమ్మెల్యేలు వారి పనితీరును మార్చుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు పార్టీ సమావేశాల్లో హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే టికెట్లు ఇచ్చేదిలేదనే మెసేజ్ పంపారు. ఇదే సమయంలో సర్వేలో సైతం సిట్టింగ్‌లపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేయడం గమనార్హం.