బీఆర్ఎస్‌కు మరో షాక్.. ఈ నెల 22న కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల్లో
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు దక్కని వారితో పాటు ఎప్పటినుంచో పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు రాజీనామా చేసి ప్రతిపక్ష కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో ఇటీవల బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తోన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు కలిశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో కూడా బాపురావు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై ఇరువురితో చర్చించారు. ఈ నెల 22న బాపురావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. రానున్న ఎన్నికల్లో బోథ్ నుంచి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌ను బాపురావు కోరినట్లు తెలుస్తోంది. ఆయన డిమాండ్‌పై కాంగ్రెస్ సానుకూలంగా ఉందని తెలుస్తోంది.
బీఆర్ఎస్‌లో సీటు దక్కని ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. నేడు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ హస్తం గూటికి చేరనున్నారు. ఇప్పటికే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా బుధవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. భారీగా చేరికలతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొనగా.. నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది.