BRS :: టార్గెట్ ‘నెగెటివ్ ఓటర్’.. వ్యతిరేక వర్గాలను అట్రాక్ చేసేందుకు బీఆర్ఎస్ భారీ స్కెచ్..!
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హీట్ అంతకంతకూ పెరుగుతుండటంతో నెగెటివ్ ఓటు బ్యాంకుపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హీట్ అంతకంతకూ పెరుగుతుండటంతో నెగెటివ్ ఓటు బ్యాంకుపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఎలక్షన్‌లో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను గుర్తించి వారిని ఆకర్షించే పనిలో ఉన్నారు గులాబీ బాస్. వారికి దగ్గరయ్యేందుకు తాయిలాలు సైతం ప్రకటిస్తున్నారు. బీసీ, మైనార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని పలు సర్వేల్లో తేలినట్టు టాక్. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత.. బీసీ కుల వృత్తులు, మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించారు. ఎంప్లాయీస్‌ను సైతం మచ్చిక చేసుకునేందుకు పీఆర్సీ కమిటీ వేస్తున్నట్టు లీకులు ఇస్తున్నారు.
సొంత రాష్ట్రంలోనూ వివక్షే..?
బీసీ కుల వృత్తుల వారిని, మైనార్టీలను తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయా వర్గాల ప్రజలు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే సొంత రాష్ట్రంలోనూ తాము వివక్షకు గురవుతున్నామన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతున్నది. దళితబంధు తరహాలో తమకు ప్రత్యేక స్కీమ్ లేకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేల్లో తేలినట్టు సమాచారం.
వీరంతా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలాగైతే ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే ప్రమాదం ఉందని గ్రహించిన అధికార పార్టీ.. వారిని ఆకట్టుకునే పనిలో పడింది. అందులో భాగంగానే రూ.లక్ష సాయం స్కీంను తెరమీదకు తీసుకొచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీసీ కులవృత్తుల సాయంపై సీక్రెట్..
బీసీ కులవృత్తులకు రూ.లక్ష సాయం స్కీమ్ అమలు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారులకు ఎంపిక, ఆర్థిక సాయం నిరంతరం కొనసాగుతుందని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మొదటినెల కేవలం 3 వేల మందికి మాత్రం ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సరిపడా నిధులు రెడీ చేసింది. కానీ ఇప్పటివరకు అందులో ఎంత మందికి చెక్కులు ఇచ్చారు? ఎంత మంది ఆ చెక్కులను డ్రా చేసుకున్నారు? అనే విషయాలను సీక్రేట్ గానే ఉంచుతున్నది.
తొలి నెలలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలోనూ నిధుల కొరత వెంటాడుతున్నట్టు సమాచారం. మైనార్టీ వర్గాల్లోని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు సైతం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మైనార్టీల్లో చాలా మంది వివిధ చేతి వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ కుటుంబాలకు సైతం రూ.లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల ప్రకటించారు. ఆ స్కీమ్ విధివిధానాలు ఇంతవరకు ప్రభుత్వం వెల్లడించలేదు.
పీఆర్సీ వచ్చే ప్రభుత్వంలోనే..?
ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారు. సర్కారు వారిపై చూపుతున్న చిన్నచూపే అందుకు కారణం. వారికి అందించే ప్రయోజనాల విషయంలో జాప్యం జరుగుతున్నది. ఇప్పటికీ ఎంప్లాయీస్‌కు ప్రభుత్వం 3 డీఏలను ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. మూడేండ్లుగా కొత్త హెల్త్ కార్డులను జారీ చేయట్లేదు. హెల్త్ స్కీమ్ కోసం జీతంలో తమ వాటాను ఇచ్చేందుకు ఉద్యోగులు ముందుకు వచ్చినా ప్రభుత్వంలో మాత్రం కదలిక లేకపోవడం కూడా వారి కోపానికి కారణమైంది.
కొత్త పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాలి. కానీ ఇంతవరకు కమిటీ వేయలేదు. ఎన్నికల ముందు పీఆర్సీ కమిటీ వేసి, సిపారసులు తీసుకునేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ లోపు ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కమిటీ సిపారసులను అమలు చేసేందుకు ప్రభుత్వం ఎంత సమయంలో తీసుకుంటుందనే అనుమానాలు ఉద్యోగ వర్గాలను వెంటాడుతున్నాయి.
కులాలతో ఆత్మీయ సమ్మేళనాలు
త్వరలో బీసీ, మైనార్టీ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీసీ కులాలతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కసరత్తు చేస్తున్నారు. బీసీ వర్గం మొత్తం బీఆర్ఎస్ వెంటే ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్టు విమర్శలు మొదలయ్యాయి. అలాగే మైనార్టీ వర్గాలతోనూ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేయాలని వివిధ మైనార్టీ కార్పోరేషన్ లీడర్లకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి :: ఊహించని మలుపులు.. తెలంగాణ రాజకీయాలు