‘నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ వెంటే ఉంటా.. టికెట్‌తో పనిలేదు’
తెలంగాణలోని 115 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఏడు గురు సిట్టింగ్‌లను మార్చడంతో పాటు నలుగురు కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని 115 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఏడు గురు సిట్టింగ్‌లను మార్చడంతో పాటు నలుగురు కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. అయితే, టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగుల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా ఉన్నారు. టికెట్ వస్తుందని చివరివరకూ ఎదురుచూసినా నిరాశే మిగిలింది.. అనూహ్యంగా బోథ్ టికెట్‌ను అనిల్ జాదవ్‌కు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో బాపురావు రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది.
ఈ నేపథ్యంలో బాపురావు పార్టీ మారే అవకాశం ఉందని విస్తృతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుచరులతో భేటీ అనంతరం ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఆయన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉండగా.. తాజాగా.. పార్టీ మార్పు వార్తలపై ఎమ్మెల్యే బాపురావు స్పందించారు. ‘‘నా ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. చివరి వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా.. కేసీఆర్ వెంటే నడుస్తా. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. బోథ్‌లో మళ్లీ బీఆర్ఎస్ జెండానే ఎగరబోతోంది. కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.’’ అని బాపురావు ధీమా వ్యక్తం చేశారు.