డబ్బులు సమకూరుస్తానన్నా పట్టించుకోవట్లేదు: Etela Rajender
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు కావాల్సిన డబ్బులు సమకూరుస్తానని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు కావాల్సిన డబ్బులు సమకూరుస్తానని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు తెలంగాణలో రెంటికి చెడ్డ రేవడిలా కేసీఆర్ తీరు మారిందని, అందుకే బీజేపీ నేతలపై దాడులు, కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ కార్పొరేటర్లను వేధిస్తున్నారని, కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు బీజేపీ కార్పొరేటర్ శశికళపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో అకారణంగా దాడి చేసి కొట్టారన్నారు. 14 రోజులు వారిని జైల్లో పెట్టారని.. బుధవారం బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. అధికార పార్టీ అసహనంతో బీజేపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని ఈటల తెలిపారు. రాజాసింగ్‌పై వేటు తొలగింపుపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బీఆర్ఎస్ ఊదితే కొట్టుకుపోయే పార్టీ అని కేసీఆర్‌ను హెచ్చరించారు. తమతో గొక్కోవద్దని, ఖబర్దార్ అంటూ ఈటల వార్నింగ్ ఇచ్చారు.
Read More: