వారసుల కోసం టీ.బీజేపీలో BIG ఫైట్.. హైకమాండ్ రియాక్షన్ ఇదే!
బీజేపీ వారసత్వ రాజకీయాలకు వేదికగా మారుతోందా? కుటుంబ పాలన, వారసత్వ పాలన అంటూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీలోనూ వారసత్వ కల్చర్ మొదలైందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ వారసత్వ రాజకీయాలకు వేదికగా మారుతోందా? కుటుంబ పాలన, వారసత్వ పాలన అంటూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీలోనూ వారసత్వ కల్చర్ మొదలైందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే.. టీబీజేపీ నేతల డిమాండ్లకు నో చెప్పాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం.
ఎవరి ప్రయత్నాలు వారివి..
వారసుల కోసం బీజేపీలో బిగ్ ఫైట్ నెలకొంది. జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి మహబూబ్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మొన్నటివరకు మిథున్ కోసం షాద్‌నగర్ సెగ్మెంట్ నుంచి ప్రయత్నించారు. కాగా.. రెండుచోట్ల ఇవ్వడం కుదరదని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో కొడుకు కోసం తన సీటునే త్యాగం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక డీకే అరుణ తన కూతురి కోసం గద్వాల సెగ్మెంట్‌ను కోరినట్లు సమాచారం. డీకే అరుణ.. నారాయణపేట నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా.. బండారు దత్తాత్రేయ తన కూతురు విజయలక్ష్మికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. విద్యాసాగర్ రావు.. వేములవాడ టికెట్‌ను కొడుకు వికాస్ రావుకు ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆయన బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వారసులకు ఇచ్చేందుకు హైకమాండ్ నో
ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ వారసులకు నో చెప్పాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం చాన్స్ ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. మొన్నటివరకు ప్రత్యర్థి పార్టీలో కుటుంబ, వారసత్వ పాలన అంటూ బీజేపీ విమర్శలు చేసింది. ఇప్పుడు కుటుంబ పార్టీ అని తమపై విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే.. బీజేపీ సీనియర్ నేతలనే బరిలో దిగాలని సూచిస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వారసుల ఫ్యూచర్‌పై దృష్టి పెడుదామనుకున్న నేతలకు బీజేపీ హైకమాండ్ షాక్ ఇవ్వడంతో ఏం చేయాలనే దానిపై సీనియర్ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.