బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.. బండి సంజయ్ రాజీనామా

తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

Update: 2023-07-04 09:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకూ స్టేట్ చీఫ్‌గా ఉన్న బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో గంటన్నరకు పైగా చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మూడున్నరేళ్ళ పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. మరోవైపు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ పార్టీ సెంట్రల్ ఆఫీస్ విడిగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో బండి సంజయ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశమున్నది. సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని నడ్డా ఇచ్చిన హామీ ఇవ్వడంతో పార్టీ వర్గాల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన స్టేట్ చీఫ్‌ బాధ్యతల్లో పార్టీ హైకమాండ్ మార్పులు చేయడం రాష్ట్ర నేతల్లో సంచలనం రేకెత్తించింది. బండి సంజయ్‌ను మార్చడం ద్వారా పార్టీకి కలిగే లాభనష్టాలపై సుదీర్ఘంగా జాతీయ నేతలు చర్చించుకున్న తర్వాతనే కొత్త చీఫ్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిర్ణయం వెలువడే సమయానికి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా బండి సంజయ్ ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ను ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా నియమించి తగిన ప్రాధాన్యత కల్పించింది పార్టీ హై కమాండ్. గతకొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్‌కు కొత్త బాధ్యతలతో కొంత ప్రయారిటీ ఇచ్చినట్లయింది. తగిన గుర్తింపు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా జాతీయ నేతలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఫామ్ హౌజ్‌కు వెళ్ళి చర్చలు జరిపి ఆహ్వానం పలికారు. ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని సున్నితంగా సమాధానం ఇచ్చి బీజేపీ నాయకత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మారిన దృష్ట్యా పార్టీ కార్యవర్గ కమిటీలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగనున్నాయి, వివిధ స్థాయిల్లోని లీడర్ల మధ్య ఎలాంటి అసంతృప్తి ఉంటుందనే చర్చ స్టేట్ ఆఫీస్‌లో మొదలైంది.

Tags:    

Similar News