మార్పు జరుగుతుందా?.. ఓటర్లు మొగ్గు చూపేది ఎటువైపు?
రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలనేది విషయంపై ఓటర్లు నేడు తీర్పు ఇవ్వనున్నారు. తెలంగాణలో దాదాపు పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని, పాలనను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ కోరుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలనేది విషయంపై ఓటర్లు నేడు తీర్పు ఇవ్వనున్నారు. తెలంగాణలో దాదాపు పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని, పాలనను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ కోరుతున్నది. మరోవైపు ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’ అనే నినాదంతో కాంగ్రెస్ ప్రచారం చేసింది. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ పరిపాలన కోసం తమను ఆదరించాలని ఓటర్లకు అప్పీల్ చేసింది. ఇంకో వైపు బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తెరపైకి తెచ్చిన బీజేపీ.. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చింది. మరి ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారు? ఏ పార్టీని ఆదరిస్తారు? అనేది కీలకంగా మారింది.
బీఆర్ఎస్ ఆశలన్నీ సంక్షేమ పథకాలపైనే..
పేగులు తెగేదాకా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించానని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇతర రాష్ట్రాల్లో లేని వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ప్రతి ఇంటికీ ఏదో ఒక స్కీమ్‌ను అందిస్తున్నామని, ఈ ప్రగతి ప్రస్థానం ఇలాగే కొనసాగాలంటే మరోసారి చాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా, వ్యవసాయానికి ఫ్రీ కరెంటు లాంటివన్నీ నిరంతరాయంగా కొనసాగించడం తమతోనే సాధ్యమని చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలో కష్టాలు, చేదు జ్ఞాపకాలను చూసిన రాష్ట్ర ప్రజలు.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పొందిన లబ్ధితో మళ్లీ తమనే గెలిపిస్తారని గులాబీ పార్టీ ఆశలు పెట్టుకున్నది. పలు పథకాలు అమలు అసంపూర్ణంగా ఉండటంతో చాలా మంది అర్హులు నిరాశకు గురయ్యారు.
‘మార్పు’ నినాదంతో కాంగ్రెస్
రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాటు అప్రజాస్వామికంగా, నియంత ధోరణిలో పాలన కొనసాగించారని, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ఈసారి జనం మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ భావిస్తున్నది. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..’ అనే స్లోగన్‌తో సిక్స్ గ్యారెంటీస్‌ను ప్రకటించింది. రాష్ట్రాన్ని ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్న సోనియాగాంధీ ఇప్పుడు సిక్స్ గ్యారెంటీస్‌నూ అమలు చేస్తుందని, అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్‌లోనే వీటికి ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటకలో గ్యారెంటీస్‌ను వంద రోజుల్లోనే అమలు చేశామని ఉదహరించింది. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, రైతులు, కౌలురైతులు, రైతుకూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, క్రిస్టియన్లు, ముస్లిం మైనారిటీలు, డబుల్ ఇండ్లురానివారితో పాటు పలు సెక్షన్ల ప్రజలు తమనే ఆశీర్వదిస్తారని, తమ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.
బీసీని సీఎం చేస్తామంటున్న బీజేపీ
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనాన్ని ఏటీఎం తరహాలో కేసీఆర్ ఫ్యామిలీ వాడుకున్నదని, రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతున్నదని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కమలం పార్టీ భావిస్తున్నది. బీజేపీని ఆదరించాలని ప్రధాని మోడీ సహా ఆ పార్టీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుని వారిని జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబంలో మాత్రం అందరికీ కేసీఆర్ ఉద్యోగాలు (పదవులు) ఇచ్చుకున్నారని ఆరోపించారు. ఈ కుటుంబ అవినీతి ఢిల్లీ వరకూ (మద్యం కుంభకోణం) పాకిందని, వారిని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు.
పాజిటివ్, నెగెటివ్ ప్రచారం
గతంలో కేవలం సెంటిమెంట్, పాజిటివ్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన పార్టీలు ఈసారి ప్రత్యర్థులు నెగెటివ్‌ను ప్రచారం చేసేందుకు ఎక్కువ కష్టపడ్డాయి. కాంగ్రెస్ వేవ్ వీస్తున్నదని ప్రజల్లో ఓరల్ టాక్ ఎక్కువ కావడంతో బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. ‘హస్తం పార్టీ అధికారంలోకి వస్తే అంధకారమే.. రైతుబంధుకు రాం రాం.., దళితబంధుకు జై భీమ్.., వ్యవసాయానికి కరెంటు బంద్..’ ఇలాంటి కామెంట్లతో ప్రజల్లో కన్‌ఫ్యూజన్ సృష్టించింది. కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసి నియంతృత్వంగా వ్యవహరించారని, ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతులు నొక్కేస్తారని, ఆత్మగౌరవం ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించింది. బీజేపీ సైతం కేసీఆర్ అవినీతికి చెక్ పెడితేనే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అది సాకారమవుతుందని ప్రచారం చేసింది. మరి వీటన్నింటినీ విన్న ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనేది సస్పెన్స్‌గా మారింది.
నేడు పోలింగ్
నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఈసీ నియమించింది. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. అప్పటి వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4.00 గంటలకే ముగియనున్నది. మొత్తం 59,779 ఈవీఎం (బ్యాలట్ యూనిట్ల)లను వినియోగిస్తున్నది.
వచ్చేనెల 3న కౌంటింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ఎల్బీనగర్ సెగ్మెంట్‌లో 48 మంది బరిలో ఉండగా.. గజ్వేల్‌లో 44 మంది, కామారెడ్డి, మునుగోడులో 39 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. వచ్చే నెల 3న కౌంటింగ్ జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్‌కు పట్టే సమయం ఎక్కువ ఉండొచ్చని ఎన్నికల అధికారుల అంచనా. పోలింగ్, కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ.. సుమారు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను విధుల్లో నియమించింది.
రూ.730 కోట్ల సొత్తు పట్టివేత
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో సుమారు రూ.730 కోట్లకు పైగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు, బంగారు ఆభరణాలు, గిఫ్టులు తదితర వస్తువులు ఉన్నాయి. మరోవైపు ఒక్కో ఓటుకు గరిష్టంగా రూ.ఐదారు వేలు ఇవ్వడానికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు మానసికంగా సిద్ధమయ్యారు. ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ టైమ్‌లోనే దసరా, దీపావళి పండుగలు రావడంతో వాటికి కూడా భారీగానే ఖర్చయింది. అన్ని పార్టీలూ పోటాపోటీగా బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంతో జన సమీకరణ, ఏర్పాట్లకు కూడా పార్టీ ఖాతా నుంచి రూ.లక్షలు ఖర్చు చేశారు.
నేడు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్
పోలింగ్ ప్రాసెస్ సాయంత్రం 5.00 గంటలకల్లా ముగియగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఒపీనియన్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా పోలింగ్ సరళికి అనుగుణంగా వెలువడే ఎగ్జిట్ పోల్ వివరాలు ఆసక్తికరంగా మారనున్నాయి. అన్ని పార్టీలూ వీటికి అనుగుణంగా కౌంటింగ్ ప్రాసెస్ జరిగేంతవరకూ కూడికలు, తీసివేతల్లో మునిగిపోతాయి. ఇప్పటివరకూ వచ్చిన ప్రీ-పోల్ సర్వే అంచనాలు, ఇంటెర్నల్‌గా చేయించుకున్న సర్వేల రిపోర్టులతో పోల్చుకుని విశ్లేషించుకోనున్నాయి. గత ఎన్నికల్లో పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ డీటెయిల్స్ వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నవాటిని ప్రామాణికంగా తీసుకుని ఈసారి ఒక అంచనాకు రావాలని భావిస్తున్నాయి.
Read More : 'పైకి గాంభీర్యం.. లోపల భయం!'.. గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన