ఖమ్మం సభలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్, బీజేపీ దోస్తీపై క్లారిటీ
తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దింపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుంటుంబాన్ని గద్దె దింపాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఎన్నికల వేళ తూతూ మంత్రంగా రుణమాఫీ ప్రకటించి రైతులకు అన్యాయం చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
కేసీఆర్ సర్కార్‌కు నూకలు చెల్లాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కుప్పకూలుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం అనేకమంది యువకులు ప్రాణత్యాగం చేశారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పాలిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి.. సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోందని అమిత్ షా జోస్యం చెప్పారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని.. రాముడిని ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయమని.. ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి భద్రాచలం వస్తారు కానీ, రాముడిని దర్శించుకోరు.. ఎందుకంటే ఆ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. భద్రాద్రి రాముడిని కూడా నిర్లక్ష్యం చేసి.. భక్తుల మనోభావాలు కేసీఆర్ దెబ్బతీశారని అన్నారు. ఒవైసీ చేతిలో ఉన్న కారును మళ్లీ గెలిపిస్తారా? అని తెలంగాణ ప్రజలను షా అడిగారు. తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థే అవుతారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై దాడులు చేసి నిలువరించొచ్చని భావిస్తున్నారు.. కానీ అది అసంభవం అని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 4G పార్టీ అని.. అంతే నాలుగు తరాల పార్టీ అని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ 2G పార్టీ అని.. అంటే రెండు తరాల పార్టీ అని ఎద్దేవా చేశారు.
ఒవైసీతో కలిసి కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయిందని.. నెక్ట్స్ కేటీఆర్‌ను సీఎం చేయాలని కలలు కంటున్నాడని విమర్శించారు. కేసీఆర్ కలలు నిజం కావని.. ఏది ఏమైనా వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. బీజేపీ ఎప్పుడు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేయదు అని స్పష్టం చేశారు. మజ్లిస్‌తో కలిసి ఉండే వాళ్ల పక్కన కూడా తాము కూర్చోబోము అని క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల నిధులు ఇస్తే.. తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రూ.2.80 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్ విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.. త్వరలోనే హైదరాబాద్ 75వ విముక్తి దినోత్సవం రాబోతోందని గుర్తుచేశారు.