తెలంగాణలో యువత, రైతుల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి: రాహుల్
తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రాంలో ఇన్ని రోజులు రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రాంలో ఇన్ని రోజులు రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఒక కుటుంబ పాలన సాగుతోందని దోపిడీ సొమ్మంతా బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందని దుయ్యబట్టారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పసుపు మద్దతు ధర రూ.12 వేల నుంచి 15 వేలకు పెంచుతామని, వ్యవసాయ ఉత్పత్తులన్నింటికి అదనంగా రూ.500 పంచుతామన్నారు. తెలంగాణ ప్రాంతంతో మాకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ అనుబంధం తరతరాలుగా కొనసాగుతోందన్నారు. ఇంత ఎండలో నా మీటింగ్ కు వచ్చినందుకు ధన్యవాదాలు. నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని నాపై కేసులు పెట్టారు. నా అధికారిక గృహం తీసుకున్నారు. కానీ నా ఇల్లు తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉందన్నారు.
కేసీఆర్‌ను తరిమి కొడతాం:
తెలంగాణ రాష్ట్రం దొర కోసం ఇవ్వలేదని సామాజిక న్యాయం కోసం రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్ పాలనలో అది జరగలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను తరిమి తరిమి కొట్టేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఈ మూడు పార్టీలు కలిసే పని చేస్తాయని రాహుల్ విమర్శించారు. ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఎంఐఎం పోటీకి దిగి బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో బీసీ కులగణన చేపట్టాలని తాను డిమాండ్ చేస్తే మోడీ సమాధానం చెప్పలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కుల గణన తెలంగాణ నుండే ప్రారంభిస్తామన్నారు. బీసీ లెక్కలు తేలిన వెంటనే తర్వాతి బడ్జెట్‌లో ఇన్ని రోజులు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. రాబోయే ప్రభుత్వంలో యువత ఆకాక్షలు నెరవేరబోతున్నాయని యువత కోరుకున్న తెలంగాణగా మారబోతున్నదని రాహుల్ అన్నారు.
Read More..