ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో కీలక భేటీ.. మూడు గంటల పాటు సస్పెన్స్!

కాంగ్రెస్‌లో చేరికలపై సీనియర్ నేతలు లోతుగా చర్చించారు. త్వరలో బీఆర్ఎస్ సహా బీజేపీ నుంచి పలువురు చేరడంపై పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే చర్చించారు.

Update: 2023-07-19 11:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో చేరికలపై సీనియర్ నేతలు లోతుగా చర్చించారు. త్వరలో బీఆర్ఎస్ సహా బీజేపీ నుంచి పలువురు చేరడంపై పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే చర్చించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో బుధవారం ఉదయం జరిగిన సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లు హాజరయ్యారు. త్వరలో లాంఛనంగా పార్టీలో చేరనున్న జూపల్లి కృష్ణారావు సైతం హాజరుకావడంతో గద్వాల నుంచి పార్టీలో చేరాలనుకుంటున్న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చేరిక గురించి చర్చించినట్లు సమాచారం. త్వరలో భారీ స్థాయిలో పార్టీలోకి చేరికు ఉంటాయనే అంశంపై చర్చ జరిపిన ఈ నేతలంతా దానికి తగిన వేదికలను, బహిరంగసభలను, నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ పైన చర్చించినట్లు తెలిసింది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి అవసరమైన రోడ్‌మ్యాప్ పైనా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో చర్చకొచ్చిన అంశాలతో పాటు తీసుకునే నిర్ణయాలను ఇన్‌చార్జి థాక్రే బుధవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వివరించనున్నారు. రాత్రికి పీసీసీ చీఫ్ రేవంత్ సైతం ఢిల్లీ వెళ్ళనున్నారు. రెండు రోజుల్లో పలువురు ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులోనే పార్టీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై సమావేశంలో వీరు చర్చించుకుంటున్నా వివరాలు బైటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు నుంచి రాష్ట్రంలో బస్సు యాత్ర నిర్వహించడంపైనా, అందులో నేతలంతా పాల్గొనడంపైనా చర్చించినట్లు తెలిసింది. నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ బస్సు యాత్రతో పాటు ఇంకా ఎలాంటి రూపాల్లో యాత్రలు చేయడం ఉపయుక్తంగా ఉంటుందో చర్చించారు.

రానున్న కాలమంతా పార్టీకి చాలా కీలకమైనదని, కర్ణాటక ఫార్ములాతోనే ప్రజల్లోకి వెళ్ళాలనే చర్చ జరిగినట్లు తెలిసింది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్నప్పుడు టికెట్ ఇచ్చే అవకాశాలు లేకుంటే వారికి ఎలాంటి భరోసా, హామీ ఇవ్వాలనేదానిపై చర్చ జరిగింది. నల్లగొండ జిల్లా నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నా వారికి టికెట్లు ఇవ్వడంలో ఉన్న సాధ్యాసాధ్యలపై చర్చించారు. మొత్తం 12 సెగ్మెంట్లలో అభ్యర్థులు ఖరారైపోయారని ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించడంతో ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ఇవ్వాల్సిన హామీలపై సీనియర్లంతా చర్చించారు.

Also Read: మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తిడితే ఊరుకుంటామా?: కోమటిరెడ్డి

Tags:    

Similar News