కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొందరపడ్డారా?

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ సైతం హస్తం గూటికి చేరారు.

Update: 2023-10-27 03:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ సైతం హస్తం గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. శుక్రవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను ఆయన కలవనున్నారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వద్ద ఉన్న వ్యూహాలను రాజగోపాల్ రెడ్డి రాహుల్‌కు వివరించనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మునుగోడు ఎన్నికలు పూర్తయిన మూడు నెలల తర్వాతనే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పలుమార్లు ఆఫర్లు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలు కీలక నాయకులతో పాటు ఢిల్లీ హైకమాండ్ కూడా సంప్రదింపులు చేసింది. కానీ గతంలో రాజగోపాల్ రెడ్డి స్పందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో కార్యకర్తల సూచన మేరకు పార్టీలోకి చేరుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

సహకారం లభిస్తుందా..?

సార్వత్రిక ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఆకస్మికంగా కాంగ్రెస్ లో చేరే రాజగోపాల్ రెడ్డికి గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ కార్యకర్తలు, లీడర్ల నుంచి సహకారం లభిస్తుందా? లేదా? అనేది సందిగ్ధంలో ఉన్నది. అయితే ఇప్పటికే మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం పాల్వాయి స్రవంతి, క్రిష్ణారెడ్డిలు పోటీ పడుతున్నారు. కానీ వాళ్లను కాదని ఇప్పుడు పారచూట్ నేతలకు టిక్కెట్లు ఇవ్వడం వలన పార్టీ పరిస్థితులు ఎలా? ఉంటాయనేది? కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హైకమాండ్ సీరియస్ గా చొరవ తీసుకుంటే తప్ప పార్టీలో సమిష్టి, సమన్వయం జరగవని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.

తొందర పడ్డారా..?

కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ బీజేపీకి వెళ్లాలని రాజగోపాల్ రెడ్డి గతంలో రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలో నిల్చొని బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఏకమవడంతో చివరికి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవాల్సి వచ్చింది. స్థానికంగా కమ్యూనిస్టులు కూడా బీఆర్ఎస్ కు మద్ధతు ఇవ్వడం గమనార్హం. దీంతో రాజగోపాల్ రెడ్డి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం గతంలో పొలిటికల్ వర్గాల్లో జోరుగా జరిగింది.

అయితే, మునుగోడు ఉప ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో ఉన్నా.. అసంతృప్తిగానే కొనసాగుతూ వచ్చారు. బీజేపీ హైకమాండ్ మాత్రం రాజగోపాల్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కానీ క్షేత్రస్థాయి ప్రజల్లో బీఆర్ఎస్, బీజేపీ కలసిపోయాయనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో ప్రజలు కూడా క్రమంగా కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వడం మొదలు పెట్టారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అమాంతంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. దీంతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News