మోడీ వ్యాఖ్యలను ఎలా తిప్పికొడతారు.. కేసీఆర్ రియాక్షన్‌పై సర్వత్రా ఉత్కంఠ!

నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. నాలుగేళ్ల క్రితం వీరిద్దరి మధ్య జరిగిన అంతర్గత చర్చల వివరాలతో కేసీఆర్‌ను ఉచ్చులోకి లాగారు.

Update: 2023-10-04 01:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. నాలుగేళ్ల క్రితం వీరిద్దరి మధ్య జరిగిన అంతర్గత చర్చల వివరాలతో కేసీఆర్‌ను ఉచ్చులోకి లాగారు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాత్రమే ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించేవారని ఇక్కడి గులాబీ నేతలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఢిల్లీలో జరిగిన మీట్స్ అన్నీ రాజకీయ అవసరాల కోసమే అని మోడీ చెప్పడంతో వివరణ ఇచ్చుకోవడం ఇప్పుడు కేసీఆర్‌కు అనివార్యమైంది. ప్రధాని కామెంట్లపై ఇప్పటికే మంత్రి కేటీఆర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ స్పందించారు. కానీ పార్టీ అధినేతగా కేసీఆర్‌ ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

రియాక్ట్ అవుతారా?.. మౌనంగా ఉంటారా?

ప్రధాని వ్యాఖ్యలపై కేసీఆర్ రియాక్ట్ అవుతారా? లేక మౌనంగా ఉండిపోతారా?.. మోడీ రహస్య అంశాలను బయటపెడతారా?.. ఒకరి బండారాన్ని మరొకరు బహిర్గతం చేసుకుంటారా?.. ఇవే ఇప్పుడు పబ్లిక్‌లో మొదలైన చర్చలు. స్పందించకుండా మౌనంగా ఉండిపోతే మోడీ చేసిన కామెంట్స్ నిజమేనని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉన్నది. కౌంటర్ ఇవ్వాల్సి వస్తే మోడీ మాటల్లో నిజం లేదని చెప్పడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది.

రాష్ట్రం కోసం కాదు.. రాజకీయం కోసమా?

కేసీఆర్.. తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా మార్చారని గులాబీ నేతలు పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ బాస్ ఢిల్లీ వెళ్లేది రాజకీయం కోసమేనని తాజాగా మోడీ కామెంట్స్‌తో స్పష్టమైందన్న వాదన బీజేపీ శ్రేణులతో పాటు ఓ సెక్షన్ ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. మేయర్ పోస్టు, కొడుకును సీఎం చేయడం, ఎన్‌డీఏ కూటమిలో చేరడం, కేంద్ర కేబినెట్‌లోకి రావడం, ఇలాంటి వాటిపై చర్చించారంటూ ప్రధాని వ్యాఖ్యానించి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేశారు.

తెరపైకి కేటీఆర్ సీఎం అంశం

కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమేనని ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. ఈ చర్చ జరుగుతున్న టైంలో మోడీ వ్యాఖ్యలు దాన్ని ధృవీకరించినట్లు అయ్యింది. ప్రధాని ఆరోపణల్లోని నిజాన్ని నిగ్గు తేల్చడం కేసీఆర్‌కు టాస్క్‌గానే మారిందని చెప్పొచ్చు. రాష్ట్రం ఏర్పడితే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానంటూ సోనియాగాంధీకి హామీ ఇచ్చారని, ఆ తర్వాత యూ-టర్న్ తీసుకున్నారని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తూ ఉంటారు. మాట ఇవ్వడం.. ఆ తర్వాత మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటేనని కాంగ్రెస్ నాయకులు అనేక సందర్భాల్లో ఆరోపించారు. కానీ ఇప్పటి వరకూ ఎన్‌డీఏ కూటమిలో చేరడంపై ఎలాంటి లీకులూ బయటికి రాలేదు. అవి అనుమానాల స్థాయిలోనే ఉండేవి. మోడీ స్వయంగా ఈ అంశాలను లీక్ చేయడంపై కేసీఆర్ ఎలాంటి కౌంటర్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

గులాబీ బాస్ ఫైర్ అవుతారా?

మోడీ వ్యాఖ్యలకు కేసీఆర్ స్పందిస్తారా?.. ఇందుకు మీడియా కాన్ఫరెన్స్‌ను వేదిక చేసుకుంటారా?.. లేక వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ద్వారా ఫైర్ అవుతారా?.. లేకపోతే కేటీఆర్, మంత్రులతోనే కౌంటర్లు ఇప్పించి ఆయన సైలెంట్‌గా ఉండిపోతారా?.. ఎన్నికల ప్రచార సభల్లో తనదైన శైలిలో సెటైర్ల రూపంలో విరుచుకుపడతారా?.. మరికొన్ని రోజుల పాటు సస్పెన్స్ కొనసాగించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఫైర్ కంటిన్యూ అయ్యేలా చేస్తారా?.. ఇలాంటి ప్రశ్నలే ఎక్కడ చూసినా వినిపిస్తున్న పరిస్థితి ఉన్నది.

Tags:    

Similar News