తెలంగాణ ఎన్నికల్లో నన్ను బ్యాట్స్‌మెన్‌గా పంపించారు: కేంద్ర మంత్రి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని క్షత్రియ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉందని మరోసారి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని క్షత్రియ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉందని మరోసారి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఇవాళ కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడని విమర్శించారు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారని, కవితను ఎలా విడిచిపెడతామని, తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందని, అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్నారు.
విదేశాల నుంచి కాంగ్రెస్ డబ్బులు తెప్పిస్తోంది
తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారని, పార్లమెంట్‌లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో తనకు తెలుసన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోందని, మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విదేశాల నుంచి డబ్బులను కాంగ్రెస్ ఎన్నికల కోసం తెప్పిస్తోందని ఆరోపించారు. దేశంలో వరల్డ్ కప్ జరుగుతోందని, మన టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోందని, అలాగే.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనను బ్యాట్స్ మెన్‌గా పంపించారని అన్నారు.