హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. రేపే భారీ బహిరంగ సభ

ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల ప్రకటన అనంతరం బీజేపీ సూర్యాపేటలో తన బహిరంగ సభను నిర్వహిస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు.

Update: 2023-10-26 16:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల ప్రకటన అనంతరం బీజేపీ సూర్యాపేటలో తన బహిరంగ సభను నిర్వహిస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే జన గర్జన సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఈ సభను సక్సెస్ చేయడంపై నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే సభ ఏర్పాట్ల పర్యవేక్షణపై రాష్ట్ర నాయకత్వం పెద్దగా ఆసక్తి కనబరచలేదని సమాచారం. ఇప్పటి వరకు బీజేపీలో అభ్యర్థుల జాబితాపై తప్పితే.. ఇతర అంశాలపైనా పెద్దగా ఎలాంటి ముందడుగు పడలేదు. మేనిఫెస్టోపైనా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ సభలో అమిత్ షా ఎలాంటి హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్‌కు చేరుకున్న ‘షా’

సూర్యాపేటలో బీజేపీ నిర్వహిస్తున్న జన గర్జన సభకు హాజరయ్యేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీలో పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలతో ఆయన శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం 11 గంటల వరకు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేషనల్ పోలీస్ అకాడమీలో వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. లంచ్ తర్వాత 2:35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో సూర్యాపేటలో బీజేపీ నిర్వహించే జన సభకు హాజరవుతారు. 3:55 గంటల నుంచి 4:45 వరకు జన సభలో షా పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు బయలుదేరి, 5:45 కు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని షా ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

Tags:    

Similar News