ఇదైనా సమర్థంగా అమలయ్యేలా చూడండి.. కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

సవాలక్ష సమస్యలతో రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే ఇవేవీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ మాత్రం 'బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' పేరుతో విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2023-10-07 10:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సవాలక్ష సమస్యలతో రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే ఇవేవీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ మాత్రం 'బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' పేరుతో విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు.. ఇప్పుడు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోగా మరో వైపు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అంటూ ప్రచారార్భాటానికి పాల్పడుతూ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పౌష్టికాహారం అందించాలనే సదుద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం మీ ప్రభుత్వంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంని ఈ సమస్యలను పట్టించుకోకుండానే అల్పాహారం పథకం అంటూ హడావుడి చేయడాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచలేదు సరి కదా జీవో 8 ప్రకారం పెరిగిన వేతనాలను ఏరియర్స్‌‌తో సహా వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఐడీ కార్డులు, యూనిఫాం ఇవ్వాలని, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలన్న డిమాండ్లను మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉంటే ఆ పరిస్థితులపై ఒక్క సారైనా మీరు సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉత్పన్నమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News