నేడు రాష్ట్రానికి కేంద్ర ఎలక్షన్ టీమ్.. ముగ్గురు కమిషనర్ల పర్యటన
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు లేదా జనవరి నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. గత 6 నెలలుగా జరుగుతున్న కసరత్తు కొలిక్కి చేరుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు లేదా జనవరి నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. గత 6 నెలలుగా జరుగుతున్న కసరత్తు కొలిక్కి చేరుకున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సహా మిగిలిన ఇద్దరు కమిషనర్లు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్షించనున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నోట్ల కట్టల కట్టడి, మద్యం రవాణా, ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడం.. తదితర అనేక అంశాలపై వివిధ స్థాయిల్లోని అధికారులతో ముగ్గురు కమిషనర్ల బృందం లోతుగా రివ్యూ చేయనున్నది. మూడు రోజుల టూర్ ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూలును విడుదల చేసే అవకాశం ఉన్నది.
ఈనెల 6 లేదా 10 తేదీల్లో షెడ్యూలు రిలీజ్ కావచ్చని ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముగ్గురు కమిషనర్లు ఇక్కడ ఉండగానే ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం రిలీజ్ చేయనున్నది. మూడు రోజుల టూర్‌లో భాగంగా మొదటి రోజున (మంగళవారం) గుర్తింపు పొందిన వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో వీరు చర్చించనున్నారు. రెండు గంటల పాటు వారి నుంచి అభిప్రాయాలను, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత జీఎస్టీ, ఐటీ, ఈడీ, డీఆర్ఐ తదితర 18 రకాల ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా డిపార్టుమెంటుల నోడల్ అధికారులు వారి స్థాయిలో రెడీగా ఉన్న సన్నాహక అంశాలను కమిషనర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రెండో రోజు పూర్తిగా మొత్తం 33 జిల్లా కలెక్టర్ల (ఎన్నికల అధికారుల బాధ్యతలు వీరివే)తో సమావేశం కానున్నారు.
కలెక్టర్లతో పాటు జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి తరఫున చేసిన ఏర్పాట్లపై డాక్యుమెంట్ల రూపంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఉదయం 9.30 గంటల మొదలు రాత్రి 7.00 గంటల వరకూ అన్ని జిల్లాల్లోని ఎరేంజ్‌మెంట్స్ మీద వివరాలను సేకరించనున్నారు. ఇప్పటివరకు విధుల్లో నియమితులైన ఎలక్షన్ స్టాఫ్‌తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర పారా మిలిటరీ బలగాల డిప్యూటేషన్ తదితరాలన్నింటినీ కమిషనర్లు వివరాలను స్వీకరించనున్నారు. చివరి రోజైన (గురువారం) ఎలక్షన్ అంబాసిడర్లు, స్టేట్ ఐకాన్, దివ్యాంగ ఓటర్లు, ఫస్ట్ టైమ్ ఓటర్లతో సమావేశం కానున్నారు. వారి నుంచి కొన్ని అభిప్రాయాలను, సూచనలను కూడా సేకరించనున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి, వారికున్న ఇబ్బందులను తొలగించడానికి వెల్లడించే సూచనలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది.
చివరి రోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలను చర్చించనున్నారు. ఓవరాల్‌గా ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధత తదితరాలపై స్పష్టమైన నిర్ణయానికి రానున్నారు. ఇక్కడ వెలువడే అభిప్రాయాలకు అనుగుణంగా ఎన్నికల షెడ్యూలు రూపకల్పనపై ఢిల్లీలో ముగ్గురు కమిషనర్లు సమావేశమై తేదీలను ఖరారు చేయనున్నారు.