వరంగల్‌లో వారికి కాంగ్రెస్‌ టికెట్‌ ఖరారు.. ప్రక‌ట‌నే త‌రువాయి..!

ఓరుగ‌ల్లు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేత‌లు అధిష్టానం ప్రక‌ట‌న కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. టికెట్ ప‌రిశీల‌న‌లో ప్రముఖంగా ఉన్న నేత‌లు గ‌త నాలుగైదు రోజులుగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాల‌యం చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు.

Update: 2023-09-24 14:39 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ఓరుగ‌ల్లు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేత‌లు అధిష్టానం ప్రక‌ట‌న కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. టికెట్ ప‌రిశీల‌న‌లో ప్రముఖంగా ఉన్న నేత‌లు గ‌త నాలుగైదు రోజులుగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాల‌యం చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు. హ‌స్తినాలోనే మ‌కాం వేసి కీల‌క నేత‌ల ద్వారా త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితుల‌ను మార్చుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్రయ‌త్నాలు సాగిస్తున్నారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి టికెట్ ఆశిస్తూ 104 మంది నేత‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అయితే, వ్యక్తిగ‌త చ‌రిష్మా, కుల స‌మీక‌ర‌ణాలు, స‌ర్వే రిపోర్టులతో పాటు పార్టీకి చేసిన సేవ‌లు, అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ ఏఐసీసీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ ముందుకు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక్కరి నుంచి ముగ్గురి నేత‌ల పేర్లను ప‌రిశీల‌న‌కు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేత‌ల ఫీడ్ బ్యాక్ తీసుకున్న స్ర్కీనింగ్ క‌మిటీ చైర్మన్ ముర‌ళీధ‌రన్.. క‌మిటీలో చ‌ర్చించిన త‌ర్వాత ఈనెల 28న కానీ లేదంటే అక్టోబ‌ర్ మొద‌టి వారంలో అభ్యర్థుల ప్రక‌ట‌న చేయ‌నున్నట్లుగా తెలుస్తోంది.

ఆ ముగ్గురికి ఒకే.. ప్రక‌ట‌నే త‌రువాయి..

ములుగు నియోజ‌క‌వ‌ర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే సీత‌క్కకు, భూపాల‌ప‌ల్లి కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి గండ్ర స‌త్యానారాయ‌ణ‌, న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డిల‌కు టికెట్ దాదాపుగా ఖాయ‌మైన‌ట్లేన‌ని తెలుస్తోంది. మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సింగిల్ నేమ్స్ ఏఐసీసీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ ముందుకు వెళ్లిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ అభ్యర్థులుగా వారి ఎంపిక ఖ‌రారైన‌ట్లేన‌ని చెప్పవ‌చ్చు. మిగ‌తా తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల‌కు రెండు నుంచి మూడు పేర్లు ఏఐసీసీ ఎన్నిక‌ల క‌మిటీ ప‌రిశీల‌న‌కు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్‌ పోటీ..!

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో జంగా రాఘ‌వ‌రెడ్డి, నాయినిరాజేంద‌ర్ రెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పులో కొండా సురేఖ‌, ఎర్రబెల్లి స్వర్ణ, సామాల ప్రదీప్‌కుమార్‌, వ‌ర్ధన్నపేట‌లో కేఆర్ నాగ‌రాజు, సిరిసిల్ల రాజ‌య్య, పాల‌కుర్తిలో ఝాన్సీరెడ్డి, ఎర్రంరెడ్డి తిరుప‌తిరెడ్డి, బండి సుధాక‌ర్‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో సింగ‌పురం ఇందిర‌, దొమ్మాటి సాంబ‌య్య, ప‌ర‌కాల‌లో ఇనుగాల వెంక‌ట్రామ్‌రెడ్డి, కొండా ముర‌ళీ, మానుకోట‌లో పోరిక‌బ‌ల‌రాం నాయ‌క్‌, డాక్టర్ ముర‌ళీనాయ‌క్‌, డోర్నక‌ల్ భూపాల్‌నాయ‌క్‌, రాంచంద్రునాయ‌క్‌, నెహ్రూనాయ‌క్‌, జ‌న‌గామ‌లో కొమ్మూరి, పొన్నాల మ‌ధ్య హోరాహోరీ టికెట్ పోరు కొన‌సాగుతోంది. పేర్లు స్ర్కీనింగ్ క‌మిటీకి చేర‌గా, అయినా కీల‌క నేత‌ల ద్వారా ఎప్పటిక‌ప్పుడు టికెట్ల కేటాయింపు స‌మాచారంపై ఆరా తీస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News