తెలంగాణలో గాలి మారుతున్నదా?.. పీక్ ప్రచారంతో పార్టీలు అప్రమత్తం
నామినేషన్ల ప్రాసెస్ పూర్తికావడంతో ఆయా పార్టీల అభ్యర్థులంతా సెగ్మెంట్లపైనే ఫోకస్ పెట్టారు. నేతలు సైతం అన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నామినేషన్ల ప్రాసెస్ పూర్తికావడంతో ఆయా పార్టీల అభ్యర్థులంతా సెగ్మెంట్లపైనే ఫోకస్ పెట్టారు. నేతలు సైతం అన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెకండ్ ఫేజ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు, నాలుగైదు రోజుల్లో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా కాంగ్రెస్ క్యాంపెయిన్‌లో పాల్గొననున్నారు. మరోవైపు బీజేపీ తరపున ప్రధాని మోడీ ఇప్పటికే రెండు బహిరంగసభల్లో పాల్గొన్నారు. త్వరలో అమిత్ షా సహా పలువురు కీలక నేతలు రాష్ట్రానికి రాబోతున్నారు. మూడు పార్టీలు హోరాహోరి ప్రచారం నిర్వహిస్తున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో గాలి ఏ పార్టీవైపు ఎంత వీస్తున్నదని ఆయా పార్టీలవాళ్లు లెక్కలు వేసుకుంటున్నరు.
అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేయడంతో పాటు, డిసెంబర్ 9న ఉదయం 10: 30 గంటలకు ఎల్బీ స్టేడియంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకుని దక్షిణాదిలో ఏకైక వ్యక్తిగా హ్యాట్రిక్ సృష్టిస్తారని కేటీఆర్ సహా గులాబీ నేతలు ప్రకటిస్తున్నారు. రెండు పార్టీలూ గెలుపు తథ్యం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. గాలి తమవైపే ఉన్నదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఆ పార్టీలు నిర్వహించే సభలతో వస్తున్న మార్పులనూ విశ్లేషించుకుంటున్నారు.
ఫీల్డ్ నుంచి ఫీడ్‌బ్యాక్ :
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ ఓటర్ల గాలి ఎటువైపు వీస్తున్నదో, గతంతో పోలిస్తే పెరిగిందా?.. లేక తగ్గిందా?.. అంటూ ఆరా తీస్తున్నాయి. ఇందుకోసం పార్టీ తరఫున స్పెషల్ విభాగాలను ఏర్పాటు చేసుకుని, అన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకుంటున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకునే వార్ రూమ్‌లతో పాటు నియోజకవర్గాల్లోనూ టీమ్ సభ్యులు టెంపొరరీగా నిర్వహిస్తున్న కేంద్రాల నుంచి వివరాలను తెప్పిస్తున్నాయి. నియోజకవర్గాల్లో వివిధ సెక్షన్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలను సేకరిస్తున్నాయి. బహిరంగసభల్లో వస్తున్న జోష్‌తో పాటు ఆ తర్వాత మారిన పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాయి.
పరిస్థితిని బట్టి దూకుడు
మార్పు, పరిస్థితికి తగినట్లుగా ప్రచారంలో దూకుడు పెంచడం, మరింతగా కేంద్రీకరించడం, గ్యాప్‌ను భర్తీ చేసుకోవడం, దిద్దుబాటు చర్యలను చేపట్టడం తదితరాలపై దృష్టి పెడుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ గెలుస్తున్నదట గదా.. ఆ పార్టీయే పవర్‌లోకి వస్తున్నదట గదా.. లాంటి అంశాలను బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంటున్నది. ఆ ప్రభావాన్ని మార్చడానికి చిన్న గీత.. పెద్ద గీత తరహాలో దీటైన వ్యూహంతో గ్రౌండ్ లెవల్‌లో మైక్రో మేనేజ్‌మెంట్ విధానాలకు శ్రీకారం చుడుతున్నది. ఇంకా వేవ్ డెవలప్ కాలేదు.. వార్ వన్ సైడ్ లాంటి పరిస్థితి రూపొందలేదు.. బీఆర్ఎస్‌తో టఫ్ ఫైటే ఉన్నది.. ఇలాంటి అంశాలు వచ్చిన నియోజకవర్గాల్లో పార్టీని స్ట్రాంగ్ చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది.
పోటాపోటీగా సభల్లో కామెంట్లు :
రెండు ప్రధాన పార్టీలూ బలం పుంజుకోడానికి, ఓటర్లలో కాన్ఫిడెన్స్ కలిగించి అనుకూలంగా మల్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఏ చర్యలతో స్ట్రెంత్ పెరుగుతుంది.. ప్రజలను ఆకర్షించవచ్చు.. తదితరాలకు తగిన యాక్షన్ ప్లాన్‌లను రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. కేసీఆర్, రేవంత్‌రెడ్డి తదితర సీనియర్ నేతలు సభలు పెట్టడానికి ముందు, ఆ తర్వాత వచ్చిన మార్పులను, కామెంట్లతో ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాలను విశ్లేషించుకుంటున్నాయి. అందుకు తగినట్లుగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. పదేళ్ల ప్రగతిపై బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఫెయిల్యూర్‌పై కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నది.
రెండు పార్టీల కార్యాచరణ సంగతి లా ఉన్నా ప్రజల్లో చోటుచేసుకున్న ఓపెన్ టాక్, వేవ్ లాంటి పరిస్థితిని మెరుగుపర్చుకోడానికి పోటీ పడుతున్నాయి. రానున్న రెండు వారాల్లో ఆ పరిస్థితిని సాధించగలిగితే గెలుపు ఖాయం అనే ధీమా నెలకొంటుందని భావిస్తున్నాయి. ఇందుకోసం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులను రంగంలోకి దించాయి. కాంగ్రెస్‌వైపు వేవ్ ఉన్నదనే వాతావరణంలో దాన్ని రివర్స్ చేయడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. ఆ వేవ్‌ను అన్ని నియోజకవర్గాలకూ విస్తరింపజేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఇప్పటివరకూ పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగని కాంగ్రెస్ ఇక నుంచి క్యాంపెయిన్‌ను వేడిక్కించనున్నది.
ఈ రెండు వారాల్లో ఆయా పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు, క్యాంపెయిన్‌లో పరస్పరం చేసుకునే విమర్శలు, ఒకదాని వైఫల్యాలను మరో పార్టీ ఎత్తిచూపడం.. వీటితో ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు బలపడతాయన్నది కీలకంగా మారింది.