తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది..?
రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్‌కు ఓటర్లు పట్టం కడతారా?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్‌కు ఓటర్లు పట్టం కడతారా?.. లేక మార్పును కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగిస్తారా? లేదంటే హంగ్‌తో బీజేపీని కింగ్ మేకర్ చేస్తారా? అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనున్నది. ఓ వైపు తప్పక విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతున్నదని ఆ పార్టీ లీడర్లు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. గెలుపు తమదంటే తమదని రెండు పార్టీలు చెబుతున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నాయి. డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తామని రేవంత్ ప్రకటించగా.. కొత్త సచివాలయం ప్రాంగణంలో మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్స్ పోల్స్ కాంగ్రెస్ వైపే
ఇటీవల అనేక సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. హస్తం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ (60 స్థానాలు) కన్నా ఎక్కువ సీట్లే వస్తాయని పేర్కొన్నాయి. ఒక రోజు ఆలస్యంగా వెల్లడైన ఇండియా టుడే సంస్థ సైతం కాంగ్రెస్ పార్టీ 63-73 స్థానాల మధ్య గెలుస్తుందని పేర్కొన్నది. కొన్ని సంస్థలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలేవీ వాస్తవం కాకపోవచ్చని, ఎగ్జాక్ట్ రిజల్టు ఎగ్జైట్‌మెంట్‌గా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఎగ్జిట్ పోల్ అంచనాలను దాటి గెలుస్తామని, తమ పార్టీ 80 మార్కు దాటుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. దీనికి తోడు బీజేపీ సైతం హంగ్ పైన ఆశలు పెట్టుకున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సంబంధం లేకుండా పబ్లిక్ మూడ్‌కు అనుగుణంగా ఏ జిల్లాలో ఏయే స్థానాల్లో గెలుపొందుతామని ఆయా పార్టీలు పక్కాగా లెక్కలు వేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమా కనిపిస్తున్నది. హస్తం పార్టీ అభ్యర్థుల్లో గెలుస్తామన్న ఉత్సాహం కాస్త ఎక్కువగా ఉంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లలో మాత్రం గెలిస్తే బోనస్.. అనే భావన వ్యక్తమవుతున్నది. కౌంటింగ్ ట్రెండ్స్ తర్వాతనే ఆలోచిద్దామనే ధోరణిలో గులాబీ అభ్యర్థులు ఉన్నారు. డీలా పడవద్దంటూ బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి భరోసా నింపే మెసేజ్‌లు క్యాండిడేట్స్‌కు వెళ్తున్నాయి.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్
నేడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది. అరగంట పాటు జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేయనున్నట్టు సీఈఓ వర్గాలు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సగటున ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కూ 14 టేబుళ్లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. పోలైన ఓట్లకు అనుగుణంగా 15 నుంచి 26 రౌండ్లలో లెక్కింపు జరగనున్నది. ఉదయం 10.30 గంటలకు ఫస్ట్ రౌండ్ వివరాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నానికి ట్రెండ్స్ వెలువడతాయి. సాయంత్రానికి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.