రాహుల్ గాంధీకి తెలంగాణ మేధావులు, విద్యావంతుల సూచన
రెండు రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీతో తెలంగాణకు చెందిన పలువురు మేధావులు, విద్యావంతులు ఆదివారం భేటీ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీతో తెలంగాణకు చెందిన పలువురు మేధావులు, విద్యావంతులు ఆదివారం భేటీ అయ్యారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం తదితరాలపై ఆయనకు పలు సూచనలు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ఆకాంక్షలను గుర్తించి యువతకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్న అంశాన్ని నొక్కిచెప్పడంతో పాటు దానికి తగిన శిక్షణ అవసరాలపై దృష్టి పెట్టాలని కోరారు. రాహుల్‌తో భేటీ అయినవారంతా వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు కావడంతో వాటికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యావిధానం, అందులోని లోపాలను వివరించారు. పేదలకు అంధాల్సిన వైద్య సౌకర్యాలు, వైఎస్సార్ హయాంలో అమలైన పథకాలు ప్రస్తుతం నిర్వీర్యం కావడం తదితరాలపై కూడా చర్చించారు.
తెలంగాణలో సామాజిక న్యాయంపైనా వీరితో రాహుల్ చర్చించారు. ఓబీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేది కాంగ్రెస్ విధానమని వారికి నొక్కిచెప్పినట్లు తెలిసింది. బ్యూరాక్రసీలో మాత్రమే కాక ఉన్నత విద్యా సంస్థల్లో సైతం వారికి అవకాశాలు దక్కలేదన్న అంశాన్ని కొన్ని ఉదాహరణలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వివరించారు. ఇకపైన ఉన్నత విద్యా సంస్థల్లో ఎలాంటి అవకాశాలు ఉండాలో, ఉన్నత స్థానాల్లో అధికారులకు తగిన ప్రయారిటీ ఇచ్చి ఆ సెక్షన్ ప్రజలకు అందించాల్సిన సామాజిక న్యాయం, కల్పించాల్సిన చేయూత గురించి వివరించినట్లు సమాచారం. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అంశాల గురించి రాహుల్ వారికి ప్రాథమికంగా వివరించినట్లు తెలిసింది.
సుమారు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, శాంతసిన్హా, వెంకటనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాధ్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ సోహ్రాబేగం, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, కే.శ్రీనివాస్, జర్నలిస్టు విఠల్, మోహన్ గురుస్వామి, సందేశ్ సింగల్కర్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే, ఏఐసీసీ నుంచి దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, యువత కోరుకుంటున్న అంశాలు తదితరాలపైన ఎక్కువగా వీరు చర్చించుకున్నారు.