మాంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌కు అనూహ్య షాక్.. తలనొప్పిగా మారిన 20 నియోజకవర్గాలు!
కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టు తర్వాత అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. 45 మందితో విడుదల చేసిన రెండో లిస్టులో దాదాపు ఇరవై నియోజకవర్గాల నేతల్లో అసమ్మతి నెలకొన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టు తర్వాత అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. 45 మందితో విడుదల చేసిన రెండో లిస్టులో దాదాపు ఇరవై నియోజకవర్గాల నేతల్లో అసమ్మతి నెలకొన్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లోని ఆశావహులు టిక్కెట్లు రాకపోవడంతో గాంధీభవన్‌లో ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన విష్ణువర్దన్ రెడ్డి అనుచరులైతే ఏకంగా గాంధీభవన్‌లో రాళ్లు విసిరారు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు చింపారు. డబ్బులకు టికెట్లు అమ్మకున్న రేవంత్ డౌన్ డౌన్.. అంటూ ఆందోళనలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా పార్టీ కార్యాలయాల్లోనూ నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇక టికెట్లు రాని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు రహస్య మీటింగ్‌లు ఏర్పాటు చేసుకొని.. రేవంత్‌పై ధిక్కార స్వరం వినిపించేందుకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధపడ్డారు.
అసంతృప్తి నేతలు వీళ్లే..
హుజూరాబాద్ నుంచి టికెట్ ఆశించిన బల్మూరి వెంకట్, అంబర్‌పేటలో లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్, ఎల్లారెడ్డిలో సుభాష్‌రెడ్డి, ఎల్‌బీ నగర్‌లో మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్, హుస్నాబాద్‌లో ప్రవీణ్‌రెడ్డి, సిద్దిపేటలో భవానీరెడ్డి, ఆదిలాబాద్‌లో గండ్ర సుజాత, షాజీద్ ఖాన్, ఆసిఫాబాద్‌లో సరస్వతి, మక్తల్, నారాయణపేట్ నుంచి టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్, వనపర్తిలో శివ సేనారెడ్డి, మేఘారెడ్డి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్, పరకాలలో గాజర్ల అశోక్, మునుగోడులో పాల్వాయి స్రవంతి, చెలమల క్రిష్ణారెడ్డి, పొన్న కైలాశ్, పినపాకలో సూర్యం, వరంగల్ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి, మహేశ్వరంలో పారిజాతా రెడ్డి, కూకట్‌పల్లి గొట్టిముక్కల వెంగల్ రావు, ఎల్లారెడ్డిలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఆసిఫాబాద్‌లో సరస్వతి, సోహేల్, బాన్సువాడలో డాక్టర్ అజయ్ కుమార్, కాసుల బాలరాజులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. వీళ్లలో కొందరు ఇండిపెండెంట్‌గానూ పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు పార్టీకి సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది.
కాంగ్రెస్ పెద్దలు బిజీ
టికెట్ రాని నేతలను బుజ్జగింపు చేసే దిశగా పార్టీ సీరియస్‌గా చొరవ చూపలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బస్సు యాత్ర బీజీలో ఉండగా, ఇటీవల పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జానారెడ్డి అధ్యక్షతన ఏర్పడిన ఫోర్ మెన్ కమిటీ కూడా యాక్టివ్‌గా లేదు. జానారెడ్డి కుమారుడి గెలుపు కోసం నాగార్జున సాగర్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతూ ముందుకు వెళ్తున్నారు. దీంతో సెకండ్ లిస్టులోని అసంతృప్తులు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.