చివరి దశకు వచ్చిన ప్రచారం.. టీ.కాంగ్రెస్ స్ట్రాటజిస్టుల నయా స్కెచ్
అసెంబ్లీ ఎన్నికల పొలింగ్‌కు సమయం దగ్గర పడుతుండంతో కాంగ్రెస్ పార్టీ తన చివరి అస్త్రాలను ప్రయోగించనున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పొలింగ్‌కు సమయం దగ్గర పడుతుండంతో కాంగ్రెస్ పార్టీ తన చివరి అస్త్రాలను ప్రయోగించనున్నది.119 నియోజకవర్గాల్లోని అభ్యర్థులంతా స్థానిక సమస్యలను ఎత్తి చూపేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ స్ట్రాటజిస్టులు సూచన మేరకు క్యాండిడేట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు నియోజకవర్గాల్లోని ప్రధానమైన సమస్యలతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పన, రైతులు, దళిత బంధు, ఇతర స్కీమ్‌ల తప్పిదాలు, పదేళ్ల పాలనలో కేసీఆర్ వైఫల్యాలను వివరించి ప్రజల్లో చర్చ జరిగేలా చొరవ చూపనున్నారు. దీంతో పాటు స్థానికంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ తప్పిదాలు, నిర్లక్ష్యం వంటివన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.
గతంలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు వాటిని మళ్లీ ప్రజల ముందు రిపీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఏఐసీసీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు, రాష్ట్ర వ్యూహకర్త శ్రీకాంత్ కుమ్మరి సలహాలతో అభ్యర్థులంతా తమ ప్రచారాల్లో కాంట్రవర్సీ ట్రిక్‌ను ఉపయోగించాలని ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ల తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూనే మరోవైపు పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోనూ జనాలకు వివరించనున్నారు. అయితే లాస్ట్ డేస్ పబ్లిసిటీలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది త్వరలో తేలనున్నది.
సోషల్ మీడియా స్పీడప్
అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లు ఊపందుకున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారాలు మొదలు పెట్టారు. అభ్యర్థి ప్రణాళిక, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, గతంలో చేసిన డెవలప్‌మెంట్లపై సోషల్ టీమ్స్ సోషల్ మీడియాల్లో సర్క్యూలేట్ చేస్తున్నాయి. ఎక్స్, పేస్ బుక్, ఇన్ స్టా తదితర సామాజిక మాధ్యమాలు వేదికలను కాంగ్రెస్ విరివిగా వాడుతున్నది. కొందరు అభ్యర్థుల పిల్లలు, బంధువులు గాంధీభవన్ లోని వార్ రూమ్ నుంచి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్, సోషల్ మీడియాల్లో ప్రచారం చేసే కార్యక్రమాలపై మానిటరింగ్ చేయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ సోషల్ మీడియా టీమ్‌ల కంటే కాంగ్రెస్ దే పై చేయి ఉండటం గమనార్హం.
బూత్ లెవెల్స్ కీలకం
కాంగ్రెస్ పార్టీకి వేవ్ వచ్చినప్పటికీ, రాబోయే ఎనిమిది రోజుల పాటు పోల్ మేనేజ్ మెంట్‌పై కూడా ఫోకస్ పెట్టాలని గాంధీభవన్ వార్ రూమ్ నుంచి అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు ఆదేశాలు అందాయి. తుది దశ ఎన్నికల ప్రచారంలో ఇవే కీలకమని వార్ రూమ్ టీమ్స్ వివరిస్తున్నాయి. బూత్ లెవెల్ కార్యకర్తలతో సమన్వయమై, అభ్యర్థులంతా ఓటర్ మైండ్‌లో కాంగ్రెస్ ఫిక్స్ అయ్యేలా చొరవ చూపాలని వార్ రూమ్ వ్యూహకర్తలు సూచించారు. లాస్ట్ డేస్‌లో తీసుకునే నిర్ణయాలు, కార్యక్రమాలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని స్ట్రాటజిస్టులు అభ్యర్థులకు చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తగ్గపోరుగా ఉన్న 30 సెగ్మెంట్లపై మరింత సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించాలని వార్ రూమ్ పార్టీకి ఆదేశాలిచ్చింది. క్షేత్రస్థాయి కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా వారం రోజుల పాటు కాపాడుకోవాలని పార్టీ సూచనలిచ్చింది.