ఈ 20 రోజులు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం.. స్వయంగా సోనియా ఫోకస్!

నేటితో నామినేషన్ల పర్వం ముగీయనున్నది. ఇప్పుడు ప్రచారాన్ని హోరెత్తించడంపై ఏఐసీసీ చీఫ్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ పెట్టనున్నారు. ఇందుకు రాబోయే 20 రోజులు కీలకమని నిర్ణయించారు.

Update: 2023-11-10 02:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నేటితో నామినేషన్ల పర్వం ముగీయనున్నది. ఇప్పుడు ప్రచారాన్ని హోరెత్తించడంపై ఏఐసీసీ చీఫ్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ పెట్టనున్నారు. ఇందుకు రాబోయే 20 రోజులు కీలకమని నిర్ణయించారు. ప్రచార సరళితో పాటు పలు అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ గురువారం ఏఐసీసీ, పీసీసీ లీడర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రానున్న రోజుల్లో చేపట్టనున్న ప్రచార క్యాంపెయిన్, అగ్ర నేతల హాజరు, ఏక కాలంలో బహిరంగ సభల నిర్వహణపై లోతుగా చర్చించారు. సిక్స్ గ్యారంటీస్‌తో పాటు త్వరలో ప్రకటించనున్న మేనిఫెస్టో సైతం ఇంటింటికీ తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సోనియా వారికి సూచించారు.

కీలక నేతల జూమ్ మీటింగ్..

తెలంగాణలో రానున్న 20 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ నిర్వహించింది. ఢిల్లీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌‌గాంధీ, హైదరాబాద్‌లోనే ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, వర్కింగ్ కమిటీ సభ్యులు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మరికొంత మంది రాష్ట్ర సీనియర్ నేతలు ఇందులో పాల్గొని లోతుగా చర్చించుకున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో రానున్న రోజుల్లో తెలంగాణలో చేపట్టనున్న ప్రచార క్యాంపెయిన్, పాల్గొననున్న అగ్ర నేతలు, ఏక కాలంలో పలువురు నేతల బహిరంగ సభలు.. ఇలాంటి అనేక అంశాలపై లోతుగా చర్చించారు.

కీలకమైన సమయం

కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో మొదలుపెట్టిన యాక్షన్ ఇప్పటి వరకూ ఆశించిన ఫలితాలనే ఇచ్చిందని, సంతృప్తికరమైన రిజల్టే వచ్చిందని వ్యాఖ్యానించిన సోనియాగాంధీ సహా పలువురు నేతలు రానున్న రోజుల్లో మరింత పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో సమిష్టి పని విధానంతో పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఈ నెల 15 నుంచి 28 వరకు రాష్ట్రంలోనే పర్యటించే అంశంతో పాటు పీసీసీ నేతలతో పాటు ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలు కూడా వస్తున్నందున వీటన్నింటి మధ్య పటిష్టమైన సమన్వయం గురించి లోతుగా చర్చ జరిగినట్లు టీపీసీసీ నాయకుడొకరు తెలిపారు. ఇందుకోసం నిర్దిష్టమైన మెకానిజాన్ని రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతపై చర్చించారు.

సిక్స్ గ్యారెంటీస్, మేనిఫెస్టోపైనా

సిక్స్ గ్యారెంటీస్ ప్రజల్లో పార్టీ పట్ల కాన్ఫిడెన్స్ పెంచాయని, కర్ణాటకలో అమలవుతున్న స్కీమ్‌లు తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించాయని జూమ్ మీటింగ్‌లో నేతలు అభిప్రాయపడ్డారు. వీటిని ప్రజల్లోకి ఇప్పటికే తీసుకెళ్లినందున.. ప్రతి ఇంటినీ టచ్ చేసేలా భవిష్యత్తు కార్యాచరణను పటిష్టంగా రూపొందించుకోవాలని సోనియా సహా పలువురు రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలిసింది. త్వరలో మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నందున అందులో పేర్కొనే హామీలనూ తూచ తప్పకుండా అమలు చేయడంపై ప్రజలకు నొక్కిచెప్పడంపైనా నిర్దిష్టమైన సూచనలు వచ్చాయి. రానున్న 20 రోజుల ప్రచార పర్వంలో విస్తృతంగా జనంలోకి వీటిని తీసుకెళ్లాలనే మెసేజ్ ఈ సమావేశం ద్వారా హైకమాండ్ వివరించింది.

ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంపై..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై ఇప్పటికే ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉన్నదని, దానికి దారి తీసిన పరిస్థితులను, ఆ కారణంగా ప్రజలు పడుతున్న బాధలు, వాటికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చూపే పరిష్కారం తదితరాలను వివరించే అంశంపైన జూమ్ మీటింగ్‌లో చర్చ జరిగింది. కేసీఆర్ కుటుంబ అవినీతిని, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలు, ఎమ్మెల్యే మొదలు ముఖ్యమంత్రి వరకు ఇష్టారీతిగా వ్యవహరించడం వీటన్నింటినీ చర్చించి కాంగ్రెస్ పాలనలో వీటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రజలకు వివరించాలని అగ్ర నేతలు సూచించారు.

అసంతృప్తి లేకుండా సక్సెస్

టికెట్ల కేటాయింపు తర్వాత అసంతృప్తి రావడం సహజమే అయినా.. ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా దీన్ని అధిగమించగలిగామని, వివిధ స్థాయిల్లోని నేతల సమిష్టి సహకారమే ఇందుకు కారణమని పీసీసీ నేతలకు ఏఐసీసీ నాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కొద్ది మంది అసంతృప్తితో పార్టీని విడిచి వెళ్లినా.. అది పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని, దానిని పూడ్చుకునే తీరులో సీనియర్ నేతలను పార్టీలోకి ఆకర్షించగలిగామని, అదే సమయంలో సొంత పార్టీ నేతలకు ప్రాధాన్యత తగ్గిందనే అసంతృప్తి వ్యక్తమైనా కన్విన్స్ చేయగలిగామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అన్ని సింగిల్ డిజిట్ స్థానాల్లో మాత్రమే అసంతృప్తి చోటుచేసుకున్నదని, ఇది కూడా ఒకటి రెండు రోజుల్లోనే సద్దుమణుగుతుందని రాష్ట్ర నేతల వివరణతో హైకమాండ్ సంతృప్తి చెందింది.

ప్రచారశైలిపై ఫోకస్

దాదాపు మూడు వారాల పాటు జరిగే క్యాంపెయిన్‌లో ప్రజలకు మరింత దగ్గర కావడంపై జూమ్ సమావేశంలో లోతుగా చర్చ జరిగినట్లు సమాచారం. వీలైనన్ని రూపాల్లో ప్రజలకు చేరువకావడం, పార్టీపైన నమ్మకాన్ని ఏర్పర్చడం, బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలోని వైఫల్యాలను, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించి మంచి రోజులు రానున్నాయనే నమ్మకాన్ని కలిగించడం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, ఆశలు తదితరాలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైందనే హామీతో పాటు వారి భాగస్వామ్యాన్ని తీసుకోవడం.. ఇలాంటి అనేక అంశాలపై సోనియాగాంధీ స్పష్టమైన అంశాలను, సూచనలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News