సోనియా గాంధీ ఫినిషింగ్ టచ్.. ఆ టఫ్ సెగ్మెంట్లలో పార్టీకి మైలేజ్?
కాంగ్రెస్ పార్టీ తుదిదశ ప్రచారంలో ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని రప్పించేందుకు రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తుదిదశ ప్రచారంలో ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని రప్పించేందుకు రాష్ట్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఆహ్వానం పలికారు. కనీసం ఒక్కరోజైనా ప్రచారంలో పాల్గొనాలని రిక్వెస్టు చేస్తున్నారు. క్యాంపెయిన్ లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ లతో డిస్కస్ చేశారు. కనీసం ఒక్క సభలోనైనా సోనియా గాంధీతో ప్రసంగం చేయించాలని పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సోనియా గాంధీని ఒప్పిస్తానని చేస్తానని కేసీ వేణుగోపాల్ కూడా హామీ ఇచ్చారని టీపీసీసీ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి అండగా ఉండాలని సోనియా గాంధీతో చెప్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ పెరగగా, సోనియా గాంధీ వస్తే ఊహించని రీతిలో వేవ్ ఉంటుందనేది పార్టీ ఆలోచన. టఫ్ సెగ్మెంట్లలోనూ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని ఆలోచిస్తున్నారు.
లేదంటే వీడియోకు ప్లాన్..
ఒకవేళ సోనియా గాంధీ రాని పక్షంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, పార్లమెంటులో బిల్లు ఎపిసోడ్ తదితర అంశాలతో సోనియా గాంధీతో ఓ వీడియో రూపంలో ఇప్పించేందుకు పార్టీ ప్లాన్ చేసింది. దీన్ని సోషల్ మీడియా, మీడియాల వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఇప్పటికే అగ్రనేతల వరుస పర్యటనలతో అభ్యర్థుల్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్నదని, కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతామని వారు భరోసా వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ వస్తే తమ గెలుపు మరింత సులువని ఓ అభ్యర్థి తెలిపారు.