అసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి.. ఎన్నికల సంఘానికి RSP ఫిర్యాదు

అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్‌ను తక్షణమే బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Update: 2023-10-12 16:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్‌ను తక్షణమే బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం హైదారాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజుతో భేటీ తర్వాత మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్పకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిబంధనలు దుర్వినియోగం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేకు చెందిన ఓ ప్రైవేట్ ట్రస్టు (కోనేరు కోనప్ప ట్రస్ట్)కి జిల్లా ఎస్పీ వెళ్లి ప్రజల ముందు ఎమ్మెల్యేను సన్మానించి.. అక్కడ ఫోటోలు దిగిన తీరును ఫిర్యాదుకు జతచేశారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబం అక్రమ సట్టాతో పాటు (మట్కా) అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో అధికార బీఆర్ఎస్ నేతలు చురుకుగా పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.

జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై, రాజకీయ ప్రత్యర్థులపై జిల్లా ఎస్పీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసుల వెనుక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందని అయన ఆరోపించారు. బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అమాయక విద్యార్థి వాలంటీర్లను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టినా కాగజ్‌నగర్ రూరల్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు భయపడ్డారని అన్నారు. స్వయంగా ముగ్గురు సీనియర్  ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే తప్ప, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. తెలంగాణాలో జరగనున్న రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరిగేలా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టినందుకు ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News