ఎన్నికల వేళ RS ప్రవీణ్ కుమార్ కీలక పిలుపు
భారత రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) అనే పదాలను తొలగించడమంటే దేశం అనాగరిక వ్యవస్థలోని మతమౌఢ్యంలోకి వెళ్తున్నట్లే అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీలకు కేంద్ర ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగిండం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ స్పందించారు. అంబేడ్కర్ రాసిన "భారత రాజ్యాంగం" దేశంలో రెండు వేల ఏళ్లకు పైగా ఉన్న ఒక అసమాన సామాజిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కటి చేసి సామాజిక, రాజకీయ, ఆర్థిక విప్లవానికి నాంది పలికిందని తెలిపారు.
దేశ పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసం, మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగ పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొనబడ్డాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడానికి మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న 'సోషలిస్టు', ‘సెక్యులర్’ పదాల తొలగింపును బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.