వారితో కేసీఆర్ ప్రైవేటు సైన్యం ఏర్పాటు.. రేవంత్ సంచలన ఆరోపణలు
మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు రిటైర్డ్ అయిన అధికారులతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిపక్షాలు, మీడియాకు చెందిన వ్యక్తులపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లు రిటైర్డ్ అయిన అధికారులతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిపక్షాలు, మీడియాకు చెందిన వ్యక్తులపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ దశను దాటి తమపై నిఘా కోసం హ్యాకర్స్‌ను రంగంలోకి దింపారని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. హ్యాకర్స్ ద్వారా మా ఫోన్లలోకి చొరబడి తమ ప్రైవేట్ సంభాణలు వింటూ కాంగ్రెస్ పార్టీకి సహాయం చేస్తామని చెబుతున్న వ్యాపారులు, బంధువులు, స్నేహితులను కేటీఆర్ బెదిరిస్తూ పార్టీకి సాహయం చేయకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌కు సహాయం చేస్తే వ్యాపారాలు క్లోజ్ చేయిస్తామని బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ విధానం ఎప్పుడూ మంచిది కాదని, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పది మంది సహకారంతో నడుస్తాయని, వ్యాపారస్తులందరిని కేటీఆరే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తామ ప్రైవేట్‌గా మాట్లాడిన విషయాలను వ్యాపారవేత్తలకు గుర్తు చేస్తూ మీరు ఈ రకంగా మాట్లాడారని చెబుతూ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ అనైతిక చర్యలకు తండ్రి కొడుకులు తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలో చేరి పని చేస్తున్న అధికారులు, టెలిఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు సహకరిస్తువారిపై డిసెంబర్ 9 తర్వాత ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ లో బాగా పనిచేస్తున్నాడని డి.ప్రణీత్ రావు అనే అధికారికి కేసీఆర్ ప్రత్యేక ప్రమోషన్ కూడా ఇచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటిని సమీక్షించి చర్యలు తీసుకుంటామన్నారు.