ఆశావహులకు రేవంత్ రెడ్డి కీలక సూచన
బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో.. బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే అనే విషయం ప్రజలకు అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో.. బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే అనే విషయం ప్రజలకు అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధం ఉన్నందునే బీఆర్ఎస్ చేస్తున్న అవినీతికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. పార్టీ గెలుపు కోసం వంశీ చంద్ రెడ్డి తాను పోటీ చేసే స్థానంలోకి నారాయణ రెడ్డిని ఆహ్వానించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో మిగతా నాయకులు వంశీచంద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు.
పవర్, పదవులు లేకపోయినా...
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పవర్ లేకపోయినా.. పదవులు లేవని తెలిసినా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మైనంపల్లి, రేఖానాయక్, కసిరెడ్డి, కూచుకుళ్లలు కాంగ్రెస్‌లో చేరారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వస్తుందనే నమ్మకంతోనే పార్టీలోకి వచ్చారన్నారు. ప్రజల మనుషులు ఎవరో.. మరుగుజ్జులు ఎవరనేది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుతుందన్నారు. కేసీఆర్ తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని హరీష్‌రావు కూడా విమర్శించడం దారుణమన్నారు. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఏం చేసిందో? బిల్లా, రంగాలు కేసీఆర్‌ను అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. ఆరోగ్య శ్రీ, రైతు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు. ఉచిత కరెంట్ హామీని రాజశేఖర రెడ్డి అమలు చేసి చూపించారన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో చేస్తున్న అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
రూ.16 వేల కోట్ల మిగులుతో ఇచ్చాం..
రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రమిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కొత్తగా మేనిఫెస్టో పేరుతో ఏం తీసుకొస్తారని? ప్రశ్నించారు. మేనిఫెస్టో పేరుతో కొత్త అబద్దాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణం వరకు చేసిన ఖర్చుకు, పిలిచిన టెండర్లకు పొంతన లేదన్నారు. రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం అని చెప్పి రూ.1200 కోట్లు ఖర్చు చేశారన్నారు. బీఆర్ఎస్ ఏం చెప్పినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన వ్యక్తి పసుపు బోర్డు ఎక్కడ పెడతారో చెప్పాలని ఎంపీ అరవింద్‌ను ప్రశ్నించారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అవి నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.