ఆ విషయంలో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు: రాహుల్ గాంధీ

తెలంగాణలో బీజేపీని నామరూపాల్లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్‌కు కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నదని, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలూ ఇంటిదారి పట్టక తప్పదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.

Update: 2023-11-26 10:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీజేపీని నామరూపాల్లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్‌కు కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నదని, ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలూ ఇంటిదారి పట్టక తప్పదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కూడా ఢిల్లీ గద్దె మీద నుంచి దింపుతామన్నారు. ఏ విషయంలోనూ బీజేపీతో, బీఆర్ఎస్‌తో, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని నొక్కిచెప్పారు. ఈ మూడు పార్టీలను ఓడించడంతో పాటు వాటి చెప్పుచేతల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

కేసీఆర్‌కు మోడీ నుంచి సంపూర్ణ సహకారం ఉన్నదని, అందువల్లనే తెలంగాణలో పదేండ్ల పాలనలో ఎన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము పోగేసుకున్నా ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తుచేశారు. అనేక అంశాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పరస్పర అవగాహన ఉన్నదని, అందులో భాగమే నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపింది మొదలు జీఎస్టీ, సాగు చట్టాల వరకు మద్దతు లభించిందన్నారు. కేసీఆర్ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడినా వారిపై ఐటీ, ఈడీ సోదాలు, కేసులు ఉండవని, మోడీ రక్షిస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. మజ్లిస్ పార్టీ కూడా ఈ రెండింటితో జతకట్టిందని, అందుకే ఆయన జోలికి దర్యాప్తు సంస్థలు వెళ్ళవన్నారు. లోక్‌సభలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే తెలంగాణలో అక్కడి నుంచి ఇక్కడికి సహకారం అందుతున్నదని ఆరోపించారు.

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపైన 24 కేసులు పెట్టి, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, అధికారిక బంగళా లేకుండా చేశారని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టి ప్రజల సర్కార్‌ను ఏర్పర్చడం కాంగ్రెస్ లక్ష్యమన్నారు. అందుకే తెలంగాణలో యుద్ధం జరుగుతున్నది దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న కేసీఆర్ ఆయన చదువుకున్న స్కూలును కట్టించింది, ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణను ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ కట్టిన అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రజలకు ఫలాలను ఇస్తున్నాయని, కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నాణ్యత ఏ స్థాయిలో ఉన్నదో మేడిగడ్డ బ్యారేజీని చూస్తే తెలిసిపోతుందన్నారు.

Tags:    

Similar News