కేటీఆర్ ఛాలెంజ్‌కు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ రిప్లై

ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజుకో షేప్ తీసుకుంటున్నది. తూటాల్లాంటి డైలాగులు రెండు పార్టీల నేతల మధ్య వినిపిస్తున్నాయి. సవాళ్ళు.. ప్రతిసవాళ్ళతో నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

Update: 2023-11-02 14:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజుకో షేప్ తీసుకుంటున్నది. తూటాల్లాంటి డైలాగులు రెండు పార్టీల నేతల మధ్య వినిపిస్తున్నాయి. సవాళ్ళు.. ప్రతిసవాళ్ళతో నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తగ్గేదే లే.. అనే తీరులో బీఆర్ఎస్ తరఫున హరీష్‌రావ్, కేటీఆర్, కాంగ్రెస్ తరపున రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఘాటుగా స్పందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందని రాహుల్‌గాంధీ విమర్శిస్తూ ఉంటే.. దాన్ని కళ్ళారా చూసి లెంపలేసుకోవాలంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. కరెంటు విషయంలోనూ కర్ణాటక, తెలంగాణ మధ్య పోలికతో పరస్పరం ఛాలెంజ్ చేసుకున్నారు. ఒకరి లోపాలను మరొకరు బైటపెట్టుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరి బస్సు యాత్ర ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవానికి గత నెల 18న వచ్చిన రాహుల్‌గాంధీ భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అంటూ విమర్శలు చేశారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచి కమిషన్ల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అవినీతి సొమ్ముతో కుటుంబ సభ్యులు సంపద పోగేసుకున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ప్రజలపై రుణభారాన్ని మోపారని కామెంట్ చేశారు. దీనికి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ట్వీట్ ద్వారా రియాక్ట్ అయ్యారు.

ప్రాజెక్టులు ఎలా కట్టాలో చూసి నేర్చుకోండి : కేటీఆర్

భూపాలపల్లి, మంథని ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాహుల్‌గాంధీని ఉద్దేశించి.. పక్కనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును చూసి రావాలంటూ కేటీఆర్ గత నెల 19న ట్వీట్ ద్వారా రిక్వెస్టు చేశారు. ప్రపంచంలోని అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించాలంటూ సెటైర్ వేశారు. ఎలాగూ మంథని వరకూ వెళ్ళారుగదా.. సాగునీటి రంగంలోనే చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్నది.. బాహుబలి మోటార్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి.. దేశానికే టీచింగ్ పాయింట్‌గా ఉన్న ప్రాజెక్టును చూడండి.. సాగునీటి రంగ చరిత్రలోనే రికార్డు సృష్టించిన, ప్రపంచంలోనే అతిపెద్ద, అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి.. అంటూ సలహా ఇచ్చారు.

గోదావరి నీటిని ఒడిసిపట్టి.. తెలంగాణ మాగాణాల్లోకి మళ్లించడాన్ని అర్థం చేసుకోండి.. బలమైన సంకల్పం ఉంటే నీరు ఎత్తుకు ఎలా పరుగులు పెడుతుందో తెలుసుకోండి.. గోదావరి నీటిని ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి.. కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి.. తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి.. అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండి.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి.. అంటూ ఆ ట్వీట్‌లో రాహుల్‌గాంధీకి కేసీఆర్ నీతిబోధలు చేశారు. అప్పటికి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు డ్యామేజ్ అయిన అంశం బాహ్య ప్రపంచానికి తెలియదు.

అవినీతి ప్రాజెక్టుకు పగుళ్ళు ఇవే: రాహుల్

కేటీఆర్ సవాల్‌కు రాహుల్ పది రోజుల తర్వాత స్పందించారు. లక్ష కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కింద ఉన్న పిల్లర్లకు పగుళ్ళు రావడం, భూమిలోకి కుంగిపోవడం కచ్చితంగా చూడాల్సిందేనని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారం సెకండ్ ఫేజ్ బస్సు యాత్ర కోసం గత నెల 31న రాష్ట్రానికి చేరుకున్న రాహుల్‌గాంధీ గురువారం (నవంబరు 2) హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు చేరుకున్నారు. కొద్దిసేపు ఆ బ్యారేజ్‌పైనే కలియదిరిగి పిల్లర్లకు జరిగిన డ్యామేజీపై ఇరిగేషన్ డిపార్టుమెంటు ఆఫీసర్లతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. ఎంత నష్టం జరిగిందో, సెంట్రల్ టీమ్ స్టడీ తర్వాత ఎలాంటి ప్రాథమిక అంచనాకు వచ్చిందో, రిపేర్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో, ఎప్పటికల్లా రెడీ అవుతుందో.. ఇలాంటివన్నీ తెలుసుకున్నారు.

“కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలాగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును చూశాను.. అవినీతి ప్రాజెక్టులో భాగమైన మేడగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించాను.. బ్యారేజీ కింద ఉన్న పిల్లర్లలో కొన్ని డ్యామేజ్ అయిన విషయాన్ని స్వయంగా చూశాను.. అవినీతితో కూడిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు పిల్లర్లకు వచ్చిన పగుళ్ళ గురించి అర్థమైంది.. నాసిరకమైన నిర్మాణం కారణంగానే పిల్లర్లకు, బ్యారేజీకి డ్యామేజ్ జరిగిందని తేలిపోయింది.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును పర్సనల్ ఏటీఎంగా వాడుకుంటున్నారు.. ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారు..” అంటూ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన తర్వాత ట్వీట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ అంటే ‘కాళేశ్వరం కరప్షన్ రావ్’, బై బై కేసీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ తగిలించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును చూసి తరించాలి.. ఆ నీళ్ళను నెత్తిమీద చల్లుకుని పాప ప్రక్షాళన చేసుకోవాలి.. విమర్శలు చేసినందుకు లెంపలేసుకోవాలి.. అంటూ హితబోధ చేసిన కేటీఆర్‌కు డైరెక్టుగా బ్యారేజీ మీదకు వెళ్ళి అధికారులు చెప్పిన వివరాల మేరకు నిర్మాణంలోని డొల్లతనాన్ని ట్వీట్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ అంచనాలు తలకిందులు కావడమే కాక బ్యారేజీ డ్యామేజీ కారణాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్‌కు సవాలు చేసిన కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న డైలాగులు ఇప్పుడు రాజకీయ సర్కిళ్ళలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News