మీ సమస్యలు నాకు వదిలేయండి.. మీ ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేస్తా

‘‘తెలంగాణకు నేనున్నా. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. ప్రజల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించను. మీరు పిలవగానే ఎప్పుడంటే అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పవర్‌లోకి రాగానే అమలు చేస్తాం.”

Update: 2023-10-19 15:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘తెలంగాణకు నేనున్నా. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. ప్రజల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించను. మీరు పిలవగానే ఎప్పుడంటే అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పవర్‌లోకి రాగానే అమలు చేస్తాం.” అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్ రాజీవ్ చౌక్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సునామీలా పవర్‌లోకి వస్తుందన్నారు. ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. వెంటనే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించనని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేస్తానన్నారు. డిసెంబరు 3న రాష్ట్రంలో.. ఆ తర్వాత ఢిల్లీలో కూడా అధికారంలోకి రాబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రజలంతా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారన్నారు.

కేసీఆర్ పాలనలో అలసిపోయిన జనాలు.. కాంగ్రెస్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ డీఏన్ఏ, బ్లడ్‌లోనే ప్రజల తరపున పోరాటడం, సమస్యలు పరిష్కరించడం ఉన్నాయన్నారు. బీజేపీ కుట్రలకు పాల్పడి ఇప్పటికే 25 కేసులు పెట్టిందని, ఇంకెన్ని కేసులు పెట్టినా.. భయపడేది లేదన్నారు. తన లాగే కాంగ్రెస్ కార్యకర్తలంతా పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల అణిచివేత ధోరణిలో సమస్యలు ఎదుర్కొంటున్నారని, మరో నెల రోజులు ఓపిక పడితే రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందన్నారు. ప్రజల చేతికే అధికారం వస్తుందన్నారు. మోడీ, కేసీఆర్ కలసే పనిచేస్తున్నారని, అందుకే కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా.. మోడీ చేతిలో ఉన్న సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ సంస్థలు కేసీఆర్ గడప తొక్కవన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News