తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసం.. కేసీఆర్ ఫ్యామిలీ కోసం కాదు

ప్రజల ఆకాంక్షలు, వారి త్యాగాల కారణంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కేసీఆర్ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం కాదని రాహుల్‌గాంధీ ఫైర్ అయ్యారు.

Update: 2023-09-17 16:48 GMT

“తెలంగాణకు ఆరు గ్యారెంటీలను ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, యువవికాసం, చేయూత, రైతు భరోసా పేర్లతో అన్ని సెక్షన్ల ప్రజలను భరోసా కల్పిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే వీటిని అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంటాం. కర్ణాటకలో అదే చేశాం. వంద రోజుల్లోనే సాకారం చేశాం. అక్కడ ఎవరిని కదిలించినా ఇదే సమాధానం వస్తుంది. తెలంగాణలో సైతం ఆరు గ్యారెంటీలను అదే స్ఫూర్తితో అమలు చేస్తాం..” = విజయభేరి సభలో రాహుల్‌గాంధీ (సెప్టెంబరు 17, 2023)

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల ఆకాంక్షలు, వారి త్యాగాల కారణంగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కేసీఆర్ ఫ్యామిలీ ప్రయోజనాల కోసం కాదని రాహుల్‌గాంధీ ఫైర్ అయ్యారు. ప్రజా ధనాన్ని కేసీఆర్ తన కుటుంబం కోసం దోచుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మోడీతో కేసీఆర్‌కు స్నేహ సంబంధాలున్నాయని, అందువల్లనే ఎంత అవినీతికి పాల్పడినా ఆయనపైనా, కుటుంబ సభ్యులపైనా కేసులుండవన్నారు. దేశంలో అన్ని విపక్ష పార్టీల నేతలపైన సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి కేసులున్నా కేసీఆర్‌పై మాత్రం ఎలాంటి కేసులూ లేవన్నారు. మజ్లిస్ పార్టీ నేతలపైనా అంతేనని అన్నారు. వారిద్దరినీ మోడీ తన సొంత పార్టీ మనుషులుగా భావించడమే ఇందుకు కారణమన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన విజయభేరి సభలో రాహుల్ పై కామెంట్లు చేశారు.

బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ‘బీజేపీ రిస్తేదార్ సమితి’గా రాహుల్ అభివర్ణించారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులకు బీఆర్ఎస్ సంపూర్ణ సహకారం అందిస్తున్నదన్నారు. గతంలో వ్యవసాయ చట్టాలకు, జీఎస్టీ చట్టానికి మద్దతు ఇచ్చిందని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే సహకారాన్ని అందించిందన్నారు. లోక్‌‌సభలో తాను స్వయంగా తన కళ్ళతోనే బీఆర్ఎస్, బీజేపీల పరస్పర సహకారాన్ని చూశానని గుర్తుచేశారు. బీజేపీకి ఎప్పుడు ఏ అవసరం పడినా ఆదుకోడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రెండు రోజుల వర్కింగ్ కమిటీ సమావేశాలు, విజయభేరి సభ పెట్టుకుంటే దానికి పోటీగా బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కార్యక్రమాలు పెట్టుకున్నాయని, కాంగ్రెస్‌ను డిస్టర్బ్ చేయడమే వాటి పని అని ఆరోపించారు.

తెలంగాణలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు :

ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా తొమ్మిదేండ్లలో ఏ వర్గం ప్రజలకూ న్యాయం జరగలేదని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చాలా రాజకీయ ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. రైతులు, పేదలు, సామాన్యులు, కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు.. ఇలా అన్ని సెక్షన్ల ప్రజల కోసం ఇచ్చినా వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తన మాటను నిలబెట్టుకున్నదని, ఇప్పుడు ప్రకటిస్తున్న ఆరు గ్యారెంటీలనూ అమలు చేస్తామన్న భరోసా కల్పించారు. రైతుబంధు స్కీమ్‌ను అమలు చేస్తున్నా భూస్వాములు, పెద్ద రైతులకు మేలు చేకూర్చారని కేసీఆర్ విధానాలను దుయ్యబట్టారు.

చివరకు ధరణి పోర్టల్ ద్వారా కూడా ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని కేసీఆర్ సర్కారు లాగేసుకున్నదని రాహుల్ గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, విద్యార్థులు, నిరుద్యోగులు, అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నా నోటిఫికేషన్ల ప్రహసనాన్ని ప్రభుత్వం నడిపిస్తున్నదన్నారు.

కేసీఆర్‌ను సాగనంపే టైమ్ వచ్చింది :

అవినీతిలో కూరుకుపోయి ప్రజల సంక్షేమానికి బదులుగా సొంత కుటుంబానికి ప్రజాధనాన్ని దోచిపెట్టే కేసీఆర్ సర్కారును ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. వంద రోజుల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టే టైమ్ వచ్చేసిందని, దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. బీఆర్ఎస్‌ను ఆదుకోడానికి ఇప్పుడు బీజేపీ, మజ్లిస్ వచ్చినా అది సాధ్యం కాదన్నారు. వారు కోరుకోకపోయినా బీఆర్ఎస్ ఇంటికి వెళ్ళక తప్పదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అప్పట్లో తొలి గ్యారంటీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ను ఇప్పుడు ఆరు గ్యారంటీలతో ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలన చూసిన తర్వాత ప్రజలకు చాలా అంశాలు స్వీయానుభవం అయ్యాయని, ఇప్పుడు కొట్లాడాల్సింది ఎవరితో అనేది స్పష్టమైందని రాహుల్ అన్నారు. రాజకీయాల్లో ఎవరితో పోరాడుతున్నామో ప్రజలు తగిన అవగాహనతో ఉండాలన్నారు. ఏ శక్తులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడుతున్నాయో తెలుసుకుని దానికి తగినట్లుగా ఓటు వేసే సమయంలో చైతన్యంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్‌తో మాత్రమే కొట్లాడడంలేదని, దీనితో పాటు బీజేపీ, మజ్లిస్‌తోనూ పోరాడుతున్నాయనే అంశాన్ని గమనంలో ఉంచుకోవాలని గుర్తుచేశారు. ఈ మూడు పార్టీలూ ఒకటేనని నొక్కిచెప్పారు. పైకి ఇవి వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం అవి ఒక్కటేనని, కలిసే పనిచేస్తాయని, కాంగ్రెస్‌ను డిస్టర్బ్ చేయడానికే ప్రయత్నిస్తాయన్నారు.

అదానీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు :

ప్రధాని మోడీ తన నమ్మకస్తుడైన అదానీకి ప్రయోజనం కలిగించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారని గుర్తుచేసిన రాహుల్‌గాంధీ.. ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రశ్నించినందుకే తనపైన అనర్హత వేటు పడిందన్నారు. అక్కడ అదానీ కోసం మోడీ తపిస్తూ ఉంటే.. ఇక్కడ కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు దోచిపెట్టడానికి తన సర్వ శక్తులనూ ధారపోస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా ఆయనపై ఒక్క కేసు కూడా పెట్టడానికి దర్యాప్తు సంస్థలు ముందుకు రావని, దానికి కారణం మోడీ నుంచి పుష్కలమైన అండదండలు ఉండడమేనని అన్నారు.

Tags:    

Similar News