ఆరోజు కేసీఆర్ రాకపోవడమే మంచిదైంది.. కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్‌కు కేసీఆర్ ఆఖరి సమయంలో వచ్చారని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్‌కు కేసీఆర్ ఆఖరి సమయంలో వచ్చారని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో "10 ఏళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్షలు - కర్తవ్యాలు" అనే సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కోదండరామ్ హాజరై మాట్లాడారు. ఉద్యమంలో సకల జనుల సమ్మెకు వచ్చిన కేసీఆర్ కనీసం ఒక గంట కూడా మాట్లాడలేదన్నారు. సాగరహారం సమయంలో కేసీఆర్ లేడని, ఢిల్లీకి వెళ్లాడని, సాగరహారం ఆపాలని కేసీఆర్ తనపై రకరకాల ఒత్తిడి తెచ్చాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆరోజు అది ఆపీ ఉంటే తెలంగాణ వచ్చేది కాదని గుర్తుచేశారు.
కేసీఆర్ రాకపోవడమే మంచిదైందని అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెడితేనే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని విమర్శించారు. అమరుల త్యాగం, నల్గొండలో జేఏసీ టెంట్ వేసి ధర్నా, బస్సులు ఆపిన ఆర్టీసీ కార్మికులు, సింగరేణి సమ్మె అన్ని అబద్దమేనా? అని నిలదీశారు. మేం కోట్లడితే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంట్లో కుర్చున్నాడని, మేమంతా కోట్లడి తెలంగాణ తీసుకొచ్చామన్నారు. ధరణి పోర్టల్ రాకముందు తెలంగాణలో 30 వేల రెవెన్యూ సమస్యలు ఉండేవని, ధరణి పోర్టల్ వచ్చాక 20 లక్షల సమస్యలు వచ్చాయన్నారు. ధరణి గొప్పదా? కాదా? ఆలోచన చేయాలన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లేదన్నారు. ధరణిలో తప్పుడు ఎంట్రీలు చేశారని, వాటిని మార్చే అధికారం కలెక్టర్, ఎమ్మార్వోకు కూడా లేదని, కేవలం హైదరాబాద్‌లోని సీసీఎల్ఏకు మార్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వం మారాలని అభిప్రాయపడ్డారు.