ఇంకా తేలని ప్రత్యర్థులు.. అయోమయంలో పార్టీల శ్రేణులు!
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. వచ్చే నెల మూడు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. వచ్చే నెల మూడు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఎవరికి టికెట్ ఇస్తారోనని ఆయా పార్టీల కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. నామినేషన్ల స్వీకరణ తేదీ ప్రకటించినా అభ్యర్థులను ప్రకటించలేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఆశావహులు తమ మద్దతుదారులను కూడగట్టుకుని కేంద్ర, రాష్ట్ర నాయకత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొందరైతే ఢిల్లీ, హైదరాబాద్‌లో మకాం వేసి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.
'హస్త'వాసి ఎవరికో?
కాంగ్రెస్ పార్టీనుంచి పోటీలో నిలిచే ఆశావహుల నుంచి ఆగస్టు 18 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులను గాంధీభవన్లో స్వీకరించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుంచి సుమారు 25కి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో స్క్రీనింగ్ కమిటీ పలు మార్లు దరఖాస్తులను పరిశీలించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రధానంగా భువనగిరి నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారు టికెట్ తమకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఒకవైపు బీసీ నినాదంతో పలువురు బీసీ నాయకులు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి సైతం భువనగిరి నియోజకవర్గ టికెట్ ను బీసీలకే కేటాయించాలని కోరారు. పార్టీని వీడిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి హస్తం పార్టీలోనే చేరడంతో టికెట్ ఆయనకే ఫిక్స్ అయిందని అనిల్ కుమార్ రెడ్డి వర్గం చెబుతోంది. తిరిగి హస్తం పార్టీలో చేరిన నాటి నుంచి అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పూర్తిగా జనాలల్లో తిరుగుతూ హస్తం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ నుంచి ఎవరు?
బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటారో ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. భువనగిరి నియోజకవర్గం నుంచి గూడూరు నారాయణరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి సుధగాని హరిశంకర్ పడాల శ్రీనివాస్ లు పోటీపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ తరుపున అభ్యర్థులను ప్రకటిస్తేనే ప్రజలల్లోకి వెళ్లవచ్చని రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు టికెట్ కోసమే ప్రధానంగా దృష్టిపెట్టారు. పోటీచేసే అవకాశం ఇవ్వాలని జాతీయ, రాష్ట్ర నేతలను కోరుతున్నారు. ఎంత ఆలస్యంగా ప్రకటిస్తే అంత ప్రజలల్లోకి వెళ్లడం కష్టంగా మారుతుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్‌లో జోష్..
సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి జోష్ లో ఉన్నారు. ఇప్పటికీ ప్రత్యర్థులు తమ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు ఇద్దరూ పూర్తి ఉత్సాహంలో ఉన్నారు. ఈనెల 16వ తేదీన భువనగిరిలో పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లలో భువనగిరి బీఆర్ఎస్ టీం నిమగ్నమైంది. సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే మండల స్థాయిలో విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.