బీఆర్ఎస్‌కు నీలం మధు గుడ్ బై.. బాధతోనే పార్టీని వీడుతున్నానని ప్రకటన

బీఆర్ఎస్ రాష్ట నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీల మధు ముదిరాజ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 22 సంవత్సరాలుగా పార్టీకి సైనికుడిలా సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2023-10-16 06:16 GMT

దిశ, పటాన్ చెరు/గుమ్మడిదల: బీఆర్ఎస్ రాష్ట నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీల మధు ముదిరాజ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 22 సంవత్సరాలుగా పార్టీకి సైనికుడిలా సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేశానని తెలిపారు. 2014లో పటాన్ చెరు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పక్షంలో ధైర్యంగా ఆనాడు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా స్వగ్రామం చిట్కుల్‌లో రెండు ఎంపీటీసీలను గెలిపించానని అందులో మా అమ్మ రాధమ్మ ఒక్కరని వెల్లడించారు. తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అలుపెరుగని కృషి చేశానన్నారు.

గత నాలుగేండ్లుగా నిత్యం ప్రజల మధ్య అంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతి కోసం అవిరామంగా సేవలందించానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం తన ఆస్తులను సైతం అమ్మి కోట్ల రూపాయలను వెచ్చిస్తే తనను గుర్తించకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోవడం బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారం నిర్వహిస్తే ఓర్వలేని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల కోసం తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం చింపివేశారని అయినా సమయమనంతో పార్టీ అభివృద్ధి కోసం శ్రమించానని గుర్తుచేశారు. బహుజన బిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కలిగినప్పుడే సబ్బండ వర్గాల జాతులకు సమన్యాయం జరుగుతుందని నమ్మి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడానికి నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇకనుంచి ప్రజలే దేవుళ్ళుగా, ప్రజలే నా అధిష్టానంగా భావిస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండడానికి నిర్ణయించుకుని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Tags:    

Similar News