న్యూస్ ఛానళ్లపై స్పెషల్ ఫోకస్.. స్పెషల్ వింగ్‌ను ఏర్పాటు చేసిన ఈసీ
శాసన సభ ఎన్నికలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల కమిటీలను నియమించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఇకపై వార్త ప్రతికలు, టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే వార్తలు, ప్రకటనలపై గట్టి నిఘాను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.
దిశ, సిటీబ్యూరో: శాసన సభ ఎన్నికలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల కమిటీలను నియమించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఇకపై వార్త ప్రతికలు, టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే వార్తలు, ప్రకటనలపై గట్టి నిఘాను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. వీటిని పరిశీలించేందుకు స్పెషల్ వింగ్‌నే ఏర్పాటు చేసింది. అడ్వర్‌టైజ్ మెంట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో, వీడియో డిస్‌ప్లే, సినిమా థియేటర్లు. రేడియో ఛానల్‌లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సెబ్‌సైట్‌లో ప్రసారమయ్యే ప్రతి వార్త, ప్రకటనను రికార్డింగ్ చేయనున్నారు. ఆడియో, వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్లతో పాటు వాల్ రైటింగ్, డిస్ప్లే వాహనాల వినియోగానికి సంబంధించిన అన్ని రకాల ప్రచారాలకు తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రోనాల్డ్ రోస్ సూచించారు. వివిధ వార్త పత్రికలు, ప్రింట్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో వచ్చే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సెక్షన్‌లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
జిల్లా ఎన్నికల అధికారి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్‌ఫర్మేషన్ బ్యూరో, డిప్యూటి డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు, జీహెచ్ఎంసీ సీపీఆర్ఓతో పాటు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఈ కమిటీలో నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏవైనా మీడియా అతిక్రమణలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ ఛానెల్స్, లోకల్ కేబుల్ నెట్‌వర్క్‌లలో ప్రసారమయ్యే అన్నిరకాల రాజకీయ ప్రకటనలను ఎంసీఎంసీ కమిటిచే ముందస్తుగా అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా పోలింగ్ రోజు, ముందు రోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలకు కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి మతాలు, వర్గాలపై దాడి, దుర్బాషలు, అనుచిత వ్యా్ఖ్యలు లేకుండా ఉండడం, హింసను ప్రేరేపించడం, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా వ్యవహరించటం, న్యాయ వ్యవస్థను ఉల్లంఘించం, దేశ సార్వభౌమత్వానికి కలిగించేలా ఉండడం, వ్యక్తి గత దూషణలు లేకుండా చూసుకోలవాలన్నారు. పైన పేర్కొన్న వాటికెలాంటి తావులేకుండా ప్రకటనలుంటే, ఇతర అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని రాజకీయ ప్రకటనలకు అనుమతినివ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా పోస్టర్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ వారు కూడా ఈ కమిటీ అనుమతి తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు పోటిచేసే అభ్యర్థులు మాత్రే హైదరాబాద్ జిల్లా ఎంసీఎంసీ కమిటీచే రాజకీయ ప్రకటనలకు అనుమతి జారీ చేయనున్నట్లు ఆయన వివరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్ట్రర్ అయిన రాజకీయ పార్టీలు రాజకీయ ప్రకటనల అనుమతి కోసం రాష్ట్రస్థాయి ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
న్యూస్ ఛానళ్ల ప్రసారాల రికార్డింగ్..
వివిధ వార్తా ఛానళ్లలో వచ్చే వార్తలను రికార్డింగ్ చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అన్ని ప్రధాన ఛానళ్లు హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు, పార్టీలు నిర్వహించే ప్రచారాలకు సంబంధించి రికార్డింగ్ చేపట్టామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల స్పష్టం చేశారు.