కాంగ్రెస్ స్కాముల గురించి ఈ పుసక్తంలో క్లియర్‌గా ఉంది: KTR

తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’, ‘స్కాం కాంగ్రెస్’ పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన ఆవిష్కరించారు.

Update: 2023-11-07 14:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణలో కాంగ్రెస్ పాపాల శతకం’, ‘స్కాం కాంగ్రెస్’ పుస్తకాలను మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కవులు శతకపద్యాలు రాసినట్టు, చిత్రగుప్తుడు మనుషుల పాపాల చిట్టా రాసినట్టు.. ఇప్పుడు కాంగ్రెస్ పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తోందన్నారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పాలనలో దేశాన్ని పూర్తిగా గాలికి వదిలేసి దోచుకోవడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఆ పాపాల చిట్టాలను రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై, తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.

హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రా ప్రాంతంతో కలుపడం మొదలు.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు బలిగొన్న యువకులు, ఉద్యమకారుల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, అన్నదాతల కన్నీరు, ఆత్మహత్యలు, నేతన్నల ఉరితాళ్లు, పదవుల కోసం పాకులాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయం, సుసంపన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా పడావుబెట్టిందనే విషయాలను పుస్తకంలో పొందుపర్చడం జరిగిందన్నారు. ఇలాంటి కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో చేసిన ఏ టూ జడ్ స్కాముల గురించి ‘స్కాంగ్రెస్’ పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు. అక్రమార్కులకు, దోపిడీ దారులకు, స్కామర్లకు అండగా ఉండి లక్షల కోట్ల కుంభకోణాలకు కారణమైందని దుయ్యబట్టారు. బొగ్గు నుంచి కామన్ వెల్త్ గేమ్స్ దాకా దేన్నీ వదల్లేదని, చివరకు ఆర్మీ వాహనాల కొనుగోలులోనూ కక్కుర్తిని ప్రదర్శించిందన్నారు. అగస్టా వెస్ట్ లాండ్ స్కాం, బోఫోర్స్ స్కాం, ఆర్మీ వాహనాల కొనుగోలు స్కాం, కోల్ స్కాం, 2జీ స్కాం, ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా పెద్దగా ఉంటుందన్నారు.

Tags:    

Similar News