వాళ్లను తన్ని తరిమేయండి.. ఓటర్లకు మావోయిస్టు పార్టీ సంచలన పిలుపు

అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత పొత్తు ఉన్నదని, ఈ రెండూ అభివృద్ధి నిరోధక పార్టీలేనని, ఎన్నికల ప్రచారానికి వచ్చే ఈ పార్టీల అభ్యర్థుల్ని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది.

Update: 2023-10-09 10:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత పొత్తు ఉన్నదని, ఈ రెండూ అభివృద్ధి నిరోధక పార్టీలేనని, ఎన్నికల ప్రచారానికి వచ్చే ఈ పార్టీల అభ్యర్థుల్ని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. బీజేపీకి రాష్ట్రంలో పార్టీ నిర్మాణం లేకపోవడంతో బీఆర్ఎస్‌తో చేతులు కలిపిందని, గతంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన అనేక చట్టాలను బహిరంగంగా సమర్ధించిందని గుర్తుచేసింది. ఈ రెండు పార్టీల మధ్య అవకాశ ఒప్పందం ఉన్నదని ఆరోపించింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారానికి వస్తే మౌలిక సమస్యల పరిష్కారం విషయంలో నిలదీయాలని పిలుపునిచ్చింది.

ఎలక్షన్ షెడ్యూలు విడుదలైన గంటల వ్యవధిలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. బీజేపీని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను తరిమేయాలని, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని కోరింది. పదేళ్ళ పాలనలో ప్రజలను దగా చేసిన బీఆర్ఎస్ మూడోసారి పవర్‌లోకి రావడానికి ప్రజలను మోసగిస్తూ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నదని పేర్కొన్నది. గతంలో ఇచ్చిన అనేక వాగ్ధానాలను అమలు చేయలేదని, ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడల్లా రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గిరిజనబంధు లాంటి మాటలతో ప్రజలను మాయ చేస్తున్నదని గుర్తుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబం సంపదను పోగేసుకున్నదని పేర్కొన్నది.

దళితులకు మూడెకరాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అటకెక్కించిందని, అటవీ చట్టాలను తుంగలో తొక్కి హరితహారం చేపట్టి ఆదివాసీలను వ్యవసాయ భూముల నుంచి గెంటివేసిందని, పోడు పట్టాల పేరుతో వారి సానుభూతి పొందాలనుకుంటున్నదని, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడంలేదని, కౌలు రైతుల్ని పట్టించుకోలేదని, ధరణి పోర్టల్ ద్వారా రైతులను భూములను భూస్వాములు, బీఆర్ఎస్ నాయకుల భూఆక్రమణలకు దారి కల్పించిందని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఉద్దేశపూర్వకంగానే గ్రూప్-1 పరీక్షలు రద్దయ్యేలా చేసిందని, సంక్షేమ పథకాల పేరుతో కేసీఆర్ బంధుమిత్రులే లబ్దిదారులై వాటాలు పంచుకుంటున్నారని.. ఇలాంటి అనేక ఆరోపణలు చేసింది.

సంక్షేమం పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీచేసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, చేసిన అప్పుల్ని చెల్లించడానికి భూములు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని గుర్తుచేసింది. భూమిలేని రైతాంగానికి సాగుభూమి, ప్రతీ ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం, ప్రతీ గ్రామంలో ఆస్పత్రి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత ఎరువుల సరఫరా, సాగునీటి వసతి కల్పించాల్సిందిగా ప్రచారానికి వచ్చే పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చింది. మౌలిక సమస్యల పరిష్కారంపై వాటిని ప్రశ్నించాలని కోరింది. అధికారం కోల్పోయి నిరాశా నిస్పృహల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ఇచ్చే నిరుపయోగ పథకాలపై నిలదీయాలని కోరింది.

Tags:    

Similar News