బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ తొలి ప్రయోగం విఫలం
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలలో అనేక సంచలనాలు నమోదు అవుతున్నాయి. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు నెలకొల్పాలని ఊవ్విళ్లూరిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆశలపై రాష్ట్ర ప్రజలు నీళ్లు చల్లారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలలో అనేక సంచలనాలు నమోదు అవుతున్నాయి. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు నెలకొల్పాలని ఊవ్విళ్లూరిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆశలపై రాష్ట్ర ప్రజలు నీళ్లు చల్లారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనకు మార్పు కోరుకున్నారు. స్పష్టమైన మెజారిటీ ఇస్తూ కాంగ్రెస్ కే జై కొట్టారు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ అధికార పీఠం మీద కూర్చోబోతున్నది. అయితే తెలంగాణ రాజకీయాల్లో తిరుగు లేని వ్యక్తిగా ఉన్న కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయగా కామారెడ్డిలో ఓటమి పాలవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు పలువురు మంత్రులు సైతం ఓటమి చవి చూడగా మరికొంత మంది మంత్రులు భారీ వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతుంటే బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే బీజేపీ గట్టిపోటీని ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలుపు దిశగా ఉండగా 6 స్థానాల్లో ఎంఐఎం, 1 చోట సీపీఐ గెలుపు వైపు పయణిస్తున్నాయి.
ఆరుగురు మంత్రుల ఓటమి:
ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు ఓటమి పాలయ్యారు. వీరితో పాటు ఇతర పార్టీలనుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు సైతం ఓటమి పాలయ్యారు. కాగా ఇందులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 26 ఏళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఓటమి పాలవడం గమనార్హం. తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న అతిపిన్న వయస్కురాలిగా యశశ్విని రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత అతి పిన్న వయసు కలిగిన వారిలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ఉన్నారు.
బీజేపీలో ఊహించని ఫలితాలు:
ఈసారి ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైన కమలం పార్టీ ఈసారి 8 చోట్ల విజయం దిశగా దూసుకుపోతున్నది. అయితే బీజేపీ అగ్రనేతలంతా పార్టీలోని ప్రముఖుల చుట్టే ఫోకస్ పెట్టగా అనూహ్య ఫలితాలు వచ్చాయి. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి ఇద్దరు సీఎం రేస్ అభ్యర్థులపై విజయం సాధించారు. ఊహించిన వారిలో నిర్మిల్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ లు గెలుపొందగా మరో ఆరు స్థానాల్లో పార్టీ ఊహించని చోట్ల ముందంజలో ఉంది. ఈ ఫలితాలపై బీజేపీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
కేసీఆర్ తొలి ప్రయోగం విఫలం:
ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ కు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఉద్యమ పార్టీగా ఇన్నాళ్లు రాష్ట్ర ప్రజల ఆదరణను చూరగొన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మారిన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇవే. జాతీయ రాజకీయాల పేరుతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చివేసిన కేసీఆర్ కు రాష్ట్ర స్థాయిలో తొలి ప్రయోగంలోనే చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్‌తో పోలిస్తే బీఆర్ఎస్ అనే పేరు ప్రజల్లోకి అంతగా చేరుకోకపోవడం కూడా గులాబీ పార్టీ ఓటమికి ఓ కారణం అనే టాక్ వినిపిస్తోంది.