ప్రధాని మోడీ సభకు ‘ఎస్సీ మోర్చా’ దూరం.. అందులో ఇన్వాల్వ్ చేయకపోవడమే కారణం?

పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు నిర్వహించనున్న ప్రధాని మోడీ. ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా భావిస్తున్నట్లు తెలిసింది.

Update: 2023-11-10 03:17 GMT
ప్రధాని మోడీ సభకు ‘ఎస్సీ మోర్చా’ దూరం.. అందులో ఇన్వాల్వ్ చేయకపోవడమే కారణం?
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు నిర్వహించనున్న ప్రధాని మోడీ. ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరగనున్నది. అయితే కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాష మాల సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన సభకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే పలువురు కీలక దళిత నేతలు పార్టీని వీడటం గమనార్హం.

ఎస్సీ వర్గీకరణ అంశంపై..

మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు హాజరవుతున్న ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయినా ఎస్సీ మోర్చా నేతలు ఈ సభకు దూరంగా ఉండాలని భావిస్తుండడం పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే సభకు దూరంగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పలువురు దళిత నేతలు భావిస్తున్నారు. అలా కాదని సభలో పాల్గొంటే మాల సామాజిక వర్గం నుంచి ఒత్తిడి వస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై ఎస్సీ మోర్చా నేతలకు సంప్రదించగా.. ఇది తమ పార్టీ సభ కాదని పలువురు చెబుతుండటం గమనార్హం.

పార్టీపై దళిత నేతల అసంతృప్తి

వికారాబాద్ అసెంబ్లీ టికెట్‌ను ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష ఆశించారు. కానీ ఆ స్థానాన్ని పెద్దింటి నవీన్ కుమార్‌కు కేటాయించారు. దీంతో ఆయన కినుకు వహించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎస్సీ మోర్చాను రాష్ట్ర నాయకత్వం పెద్దగా ఇన్వాల్వ్ చేయడం లేదని వారు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు ఇప్పటికే పలువురు దళిత కీలక నేతలు పార్టీని వీడారు. అందులో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వంటి వారు ఉన్నారు. ఎస్సీ రిజర్వుడ్ సెగ్మెంట్లకు ఇన్ చార్జిగా దళిత నేతకు కాకుండా జితేందర్ రెడ్డిని పార్టీ నియమించడంపై విమర్శలు వచ్చాయి. ఏడాది ముందే ఈ కమిటీ నియామకమైనా.. అభ్యర్థులను ఎంపికలో ఈ కమిటీ విఫలమైందనే చర్చ జరుగుతున్నది. అయితే అసంతృప్తితో ఉన్న ఎస్సీ మోర్చా నేతలు ప్రధాని మోడీ సభకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News