కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న నిరుద్యోగులు.. కరపత్రాలు వైరల్
బీఆర్ఎస్‌ను ఓడించాలంటూ ఇప్పటికే పౌర సమాజ వేదికల జేఏసీ పిలుపునివ్వగా తాజాగా ‘తెలంగాణ నిరుద్యోగులు’ పేరుతో కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌ను ఓడించాలంటూ ఇప్పటికే పౌర సమాజ వేదికల జేఏసీ పిలుపునివ్వగా తాజాగా ‘తెలంగాణ నిరుద్యోగులు’ పేరుతో కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేస్తే 30 లక్షల మంది నిరుద్యోగులకు చంపేస్తాడని, చనిపోతున్న నిరుద్యోగుల, విద్యార్థులు ఉసురు మనకు, మన ఇంట్లో వాళ్లకు తగులుతుందని పేర్కొన్నారు. ‘అమ్మా.. నాన్నా... ఆలోచించండి.. మీ కొడుకు, కూతురు ఉద్యోగం చేసుకోవాలా? ఉరి వేసుకోవాలా? ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటే నిర్ణయిస్తుంది! యాభై వేల జీతం వచ్చే ఉద్యోగం నీ కొడుకు, కూతురుకి ఇవ్వకుండా మీకు రెండు వేల పింఛన్ ఇచ్చి మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయబోమని ఒట్టు చేసుకోండి..’ అని నిరుద్యోగులు పిలుపునిచ్చారు.
ఒక్కో శవానికి ఐదు లక్షలు ఇస్తరు
‘తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇంటికొకరు సావండి.. ఒక్కో శవానికి ఐదు లక్షల ఇస్తానంటున్నాడు.. మీరు మీ కొడుకు, కూతురిని ఎంత కష్టపడి చదివించారు.. వారు ప్రయోజకులై మంచి ఉద్యోగం చేయాలని ఎన్నో కలలు కన్నారు.. ఆలోచించండి..’ అని ఆ కరపత్రంలో కోరారు. ఎంతోమంది కొడుకులు, కూతుళ్లు ఎన్నో సంవత్సరాలు చదివి, తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడానికి సొంతూరు వదిలి హైదరాబాద్ పోయిండ్రు.. ఉద్యోగం వచ్చేవరకు ఊరికి రాకుండా కష్టపడి చదువుకొన్నారు.. ఎంతో ఆశతో పరీక్షలు రాస్తే... కేసీఆర్ ప్రభుత్వం 18 సార్లు పరీక్షలను రద్దు చేసిందని ఆ కరపత్రంలో నిరుద్యోగులు గుర్తుచేశారు.
గొంతు కోస్తున్న సీఎంకు బుద్ధి చెప్పాలి
‘పిల్లల పరిస్థితి ఏంది? ఉద్యోగం రాలేదని ఉరేసుకొని చనిపోతున్నారు.. పిల్లలు చనిపోయేలా చేస్తున్న కేసీఆర్‌కు ఓటు వేయొద్దు.. పదేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థుల, నిరుద్యోగుల ప్రాణాలను తీస్తున్నది..’ అని ఆ కరపత్రంలో తెలంగాణ నిరుద్యోగులు ఆరోపించారు. తెలంగాణ సాధించింది ఇందుకోసం కాదని, నమ్మించి గొంతు కోస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని తల్లిదండ్రులకు అప్పీల్ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడిద్దాం.. తెలంగాణ యువత ప్రాణాలను కాపాడుకుందాం.. అని పిలుపునిచ్చారు.