ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. లోపం జరిగిందని అగీకారం!

బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వసాధారణం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో డ్యామేజీ నిజమేనని ఒప్పకున్నట్లయింది.

Update: 2023-11-23 14:31 GMT
ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. లోపం జరిగిందని అగీకారం!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వసాధారణం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో డ్యామేజీ నిజమేనని ఒప్పకున్నట్లయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందని అంగీకరించినట్లయింది. నిన్నటివరకు రెండు శ్లాబ్‌ల మధ్య గ్యాప్ అంటూ కామెంట్ చేసిన మంత్రి, ఆలస్యంగా బ్యారేజీల్లో సమస్యలు సాధారమని, అవి వస్తుంటాయని అన్నారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు.. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దన్నారు. నాగార్జున సాగర్‌ నిర్మించిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయని, రెండేండ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీటమునిగాయని అన్నారు. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు అని విపక్షాలకు సూచించారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో గురువారం తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి పర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలో పూర్తిచేశామన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, 1531 కిలోమీటర్లు, టన్నెల్ 203 కిలో మీటర్లు ఉందన్నారు. ఇంజినీరింగ్‌లో లోపాలు ఉంటే సవరణలు చేయడంతో పాటు పునర్నిర్మాణపనులు చేపడతామని నిర్మాణ కంపెనీ చెబుతోందన్నారు. ప్రజలు, ప్రభుత్వంపై పైసా భారం పడదన్నారు. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఇది ఆసియాలోనే సర్జ్ ఫుల్ ప్రాజెక్టు అన్నారు. కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదనారు. తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తున్నదన్నారు. కృష్ణాజిలాల్లో వాటర్ తేల్చకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పవర్ ఇస్తే.. ప్రజలకు పవర్(కరెంటు) ఉండదు అని అన్నారు.

తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ రాష్ట్రంగా నిలిచిందని, జీఎస్‌డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ‘తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారిందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నామని, దీనికోసం కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నామన్నారు.

మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించామన్నారు. సాగునీరు రావడంతో సంపద సృష్టించబడిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేసింది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో మొదటి విడత 9వేల పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ధరణిని రద్దు చేసి పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టిందని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఏనాడూ మతాన్ని రాజకీయం కోసం వాడుకోలేదన్నారు. దశలవారీగా ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగు టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సినీ ఇండస్ట్రీలో తెలంగాణ యాస, భాషలేకుండా సినిమాలే ఉండటం లేదని, తారక్, బాలకృష్ణ అందరూ ఆగ్రహీరోలు మాట్లాడుతున్నారన్నారు. 300 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో అతితక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. హరితహారంతో గ్రీన్ కవర్ 7.7శాతం పెరిగిందన్నారు. 

Tags:    

Similar News