రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ, గోత్రం ఒక్కటేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ సోమాజిగూడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.

Update: 2023-11-27 07:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ, గోత్రం ఒక్కటేనని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ సోమాజిగూడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి రాహుల్‌కు సిగ్గు శరం ఉండాలని మండిపడ్డారు. ‘రాహుల్.. నీ పార్టీ ఏంటి..? కేసీఆర్ పార్టీ ఏంటి..? కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చారో తెలుసా? రాహుల్.. మీ ఇంటికి రమ్మంటావా? ఢిల్లీకి రమ్మంటావా లేక నువ్వే హైదరాబాద్ వస్తావా? అమరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమా’ అని కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని అన్న వారిని చెప్పుతో కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత హామీలతో డ్రామాలు చేస్తున్నాయని, రైతుబంధు విషయంలో ఉభయ పార్టీలు నాటకం ఆడుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కుటుంబ పార్టీలను బీజేపీ ఎప్పటికీ వదిలిపెట్టదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద తమ పోరాటం అగదని హెచ్చరించారు.

బీజేపీ అధికారలోకి రాగానే హైదరాబాద్ పేరు కచ్చితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అసలు హైదర్ ఎవడు? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పేరు ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో అనేక పేర్లు మర్చబడ్డాయని గుర్తుచేశారు. తెలంగాణలో మొదటిసారి ప్రధాని రోడ్ షో జరగనుందని, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు రోడ్ షో జరగనుందని తెలిపారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా, లక్ష మంది రాహుల్‌లు వచ్చినా, కోట్ల మంది ఓవైసీలు వచ్చినా, 2024లో మళ్ళీ పీఎం మోడీయే, దీన్ని ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తంచేశారు.

Tags:    

Similar News