బీఆర్ఎస్ చేతిలో బ్రహ్మాస్త్రం.. కేసీఆర్ ప్రకటించనున్న అబ్బురపర్చే పథకం ఇదే!
వరుసగా ముడోసారి విజయం సాధించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త స్కీమ్ ప్రకటించబోతున్నారా?.. ఆయన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రమేంటి ?.. దేశమే అబ్బురపడే పథకాన్ని ప్రకటిస్తారా?.. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు ఆయన బైటకు తీయబోయే బ్రహ్మాస్త్రమేంటి?
‘భట్టి విక్రమార్క గారూ.. మా దగ్గర ఇంకా రెండు మూడు స్కీములున్నాయి. వాటిని ప్రవేశ పెడితే మీ పార్టీ ఖతమే. నేను ఆషామాషీగా చెప్పడం లేదు. ఇప్పుడున్న టర్ము కాకుండా కనిష్టంగా ఇంకా రెండు టర్ములు మేమే గెలుస్తాం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానమూ అవసరం లేదు.’ 2019 సెప్టెంబర్ 22న ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: వరుసగా ముడోసారి విజయం సాధించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త స్కీమ్ ప్రకటించబోతున్నారా?.. ఆయన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రమేంటి ?.. దేశమే అబ్బురపడే పథకాన్ని ప్రకటిస్తారా?.. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు ఆయన బైటకు తీయబోయే బ్రహ్మాస్త్రమేంటి?.. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ. బీఆర్ఎస్ నేతలు మాత్రం ‘మా సార్ సరైన టైమ్‌లో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఆసరా స్కీం తరహాలోనే రైతులకు పింఛన్ స్కీమ్ తెస్తారు. వచ్చే నెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో దానిని ప్రకటిస్తారు’ అని ధీమాగా చెబుతున్నారు.
కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్‌కు దీటుగా
కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నది. ఇప్పటికే హస్తం పార్టీ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్‌కు దీటుగా బీఆర్ఎస్ రైతు పింఛన్ పథకం ప్రవేశ పెట్టే ఆలోచనలు చేస్తుంది. పార్టీ అధినేత దీనిపై ఎలాంటి కసరత్తు చేస్తున్నారన్నది వెలుగులోకి రాకపోయినా ఆ పార్టీ నేతలు మాత్రం దానిపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. వచ్చే నెల 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభ వేదికగా ఒకేసారి ఎన్నికల మేనిఫెస్టోను, కొత్త స్కీమ్‌ను ప్రకటిస్తారన్నది వారి నమ్మకం. పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే స్లోగన్‌ను అందుకున్నందున రైతుల కోసమే కొత్త స్కీమ్ తెస్తారన్న ఊహాగానాలు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
గతంలో అమలు కాని ఎన్నో ప్రకటనలు
దేశమే అబ్బురపడే.. అడ్డం పడే అద్భుతమైన పథకం ఉన్నదని గతంలో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ దాని ఊసే లేదు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని ఇవ్వలేదు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక టైమ్‌లో ఉనికిలోకొచ్చిన దళితబంధు పథకమే ఆ సెన్సేషనల్ స్కీమ్ అనే చర్చలు వినిపించాయి. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు ఎలా ఉన్నా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కొత్త స్కీమ్ తెరపైకి తీసుకు రావడం ఖాయమనే అభిప్రాయం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది. ఇప్పుడు అమలవుతున్న స్కీమ్‌ల ఆర్థిక సాయం కూడా పెంచాలన్నది ఓ ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తున్నది.
గత ఎన్నికలప్పుడు రైతుబంధు
ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కేసీఆర్ కొత్త స్కీమ్ తెరపైకి తెస్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుబంధు స్కీమ్‌ను ప్రకటించారు. ప్రతి సీజన్‌కూ ఎకరానికి రూ.4,000 చొప్పున పట్టా ఉన్న రైతులందరికీ అన్ లిమిటెడ్‌గా (ఎంత భూమి ఉన్నా) ఇస్తామన్నారు. ఆ ఎన్నికలతోనే ఈ స్కీమ్ ఉనికిలోకొచ్చింది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికల టైంలో దళితబంధు స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ తలా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు అన్ని కుటుంబాలకు అందజేశారు.
బీసీ బంధు, గిరిజన బంధు
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీసీ బంధు, గిరిజన బంధు లాంటి హామీలిచ్చారు. దానికి కొనసాగింపుగానే చేతివృత్తులకు చేయూత పేరుతో ఒక్కో లబ్ధిదారునికి రూ.లక్ష చొప్పున సాయం చేయనున్నట్లు ప్రకటించారు. దీని కోసం బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు కూడా స్వీకరించింది. జూన్ నెలలో జరిగిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ టోకెన్‌గా ప్రారంభించారు. ఇప్పటికీ అది పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. జిల్లాల్లో బీసీ యువత ఈ సాయంపై ఆశలు పెట్టుకున్నది. కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేని కారణంగా అది ప్రారంభోత్సవానికే పరిమితమైంది. గిరిజన బంధు ఇంకా చర్చల్లోకే రాలేదు.
ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేలా..
కౌలు రైతులు, రైతు కూలీలకు కాంగ్రెస్ ‘సిక్స్ గ్యారంటీస్’ ద్వారా స్పష్టమైన హామీనివ్వడంతో ఆ సెక్షన్ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త పథకం ప్రవేశ పెట్టే ఆలోచన చేస్తున్నట్లు గులాబీ నేతల ద్వారా తెలుస్తున్నది. రైతుబంధు స్కీమ్ ఈ సెక్షన్ ఓటర్లకు అందకపోవడంతో ఆ ఎఫెక్టుతో ఓటు బ్యాంకు దెబ్బతినకుండా చూసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ధరణితో కొన్ని గ్రామాల్లో తలెత్తిన చిక్కులతో రైతుల్లో ఒక సెక్షన్ దూరమయ్యే అవకాశం ఉంటుందనే భయం ఎలాగూ బీఆర్ఎస్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నది. కౌలు రైతులకు ఎలాంటి సాయం ప్రభుత్వం నుంచి అందక పోవడంతో దాదాపు 40% మంది రైతులు చేజారిపోతారనే ఆందోళన బీఆర్ఎస్‌లో నెలకొన్నది. అందుకే కొత్త స్కీం తెచ్చి వారిని సంతృప్తి పర్చాలని, ఓటు బ్యాంకును కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.