కారు దిగుతున్న కీలక నేతలు.. పార్టీ మార్పు వెనక బడా నేత హస్తం!
నల్లగొండ నియోజకవర్గంలో గతవారం రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటివరకు పార్టీలో అంతా తామేనని తిరిగిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కసారిగా కండువా మార్చారు.
దిశ, నల్లగొండ బ్యూరో: నల్లగొండ నియోజకవర్గంలో గతవారం రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటివరకు పార్టీలో అంతా తామేనని తిరిగిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కసారిగా కండువా మార్చారు. అయితే, దీని వెనకాల జిల్లాలో ఉన్న అధికార పార్టీ సీనియర్ నేత హస్తం బలంగా ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ నేత ఇంట్లోనే పార్టీ మారుతున్న నాయకులతో ముందురోజు కొంత చర్చలు జరిగినట్లు వర్గాల సమాచారం. కానీ, తనకి ఏమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే విషయం పట్టణంలో పెద్ద హాట్ టాపిక్‌గా కొనసాగుతుంది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి
ముందురోజు వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు తెల్లవారే సరికి ప్రతిపక్ష పార్టీ నేత ఇంట్లో దర్శనం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అందరూ అధికార పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 8 మంది కౌన్సిలర్లు ఒక ఎంపీటీసీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఇదిలా ఉంటే ఈ చేరికల పరంపర భవిష్యత్తులో కూడా సాగే అవకాశం ఉందని వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ, ఎంపీపీతో పాటుగా ఓ పదిమంది సర్పంచులకు కూడా అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా మరో 10 మంది కౌన్సిలర్లు కూడా దసరా తర్వాత కండువా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నుంచి కూడా..
క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు బీజేపీ ఉండేది. కానీ నేడు ఉన్న కొద్దిపాటి మంది నాయకుల మధ్య మూడు గ్రూపులు ఆరు కొట్లాటలు అనే మాదిరిగా తయారైంది. వీటి పట్ల అసంతృప్తిగా ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, ఇద్దరు జిల్లా స్థాయి నాయకులు పార్టీ మారుతున్నట్లు సమాచారం. కేవలం బీజేపీలో ఉన్న గ్రూపు త్యాగాల వల్ల విసిగిపోయిన నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు చర్చలు పూర్తి చేశారని, దసరా తర్వాత హస్తం గూటికి చేరనున్నారు.
పార్టీ మార్పు వెనకాల ఆ బడా నేత హస్తం..
నల్గొండ నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా గులాబీ రేకులు రాలిపోతున్నాయి. అయితే, పార్టీ మారిన నాయకులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ పార్టీ మారేంత లేదన్న విషయం తెలిసింది. కానీ, ఆ నాయకులు పార్టీ మారడం వెనుక అధికార పార్టీకి సంబంధించిన ఓ అగ్ర నాయకుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నాయకులు పార్టీ మారే ముందు ఆ నేతతోనే చివరిసారిగా మాట్లాడి వెళ్లినట్లు సమాచారం. అయితే భవిష్యత్తులో పార్టీ మారే అవకాశం ఉన్న జెడ్పీటీసీ, ఎంపీపీ, కొంతమంది సర్పంచులు కూడా ఆ బడా నేత సూచనల మేరకే పార్టీ మారుతున్నట్లు తెలిసింది.