టీ.కాంగ్రెస్‌లో సెకండ్ లిస్ట్ కల్లోలం.. రాజీనామాకు సిద్ధమైన పలువురు నేతలు
టీకాంగ్రెస్‌లో సెకండ్ లిస్ట్ ఆ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. 45 స్థానాలకు నిన్న రాత్రి అభ్యర్థులను ప్రకటించగా ఆ స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ చాలా కాలంగా పని చేస్తున్న తమను కాదని ఇతరులకు బరిలోకి దించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్‌లో సెకండ్ లిస్ట్ ఆ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. 45 స్థానాలకు నిన్న రాత్రి అభ్యర్థులను ప్రకటించగా ఆ స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ చాలా కాలంగా పని చేస్తున్న తమను కాదని ఇతరులకు బరిలోకి దించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అనేక చోట్ల టికెట్ దక్కని అసంతృప్త నేతలు అత్యవసరంగా తమ ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. వారితో చర్చించి భవిష్యత్ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పలువురు పార్టీకి రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి నిరాశపడిన పీజేఆర్ తనయుడు, మజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ దక్కపోయినా ఇక్కడి నుంచి పోటీలో ఉంటానని ప్రకటించగా మునుగోడు టికెట్ ఆశించి భంగపడిన చెలమల కృష్ణారెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంటి పోటీకి దిగబోతున్నట్లు ప్రకటించారు. అయితే నేతల అసంతృప్తులు ఇలా కొనసాగుతుంటే అధిష్టానం మాత్రం సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించామని చెబుతోంది. మొదటి జాబితా లిస్ట్ పై అసంతృప్తులు చల్లారుతున్న తరుణంలో రెండు జాబితా విషయంలో అదే సీన్ కంటిన్యూ అవుతున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీలో ఇంకా పెండింగ్ లో మరో 19 స్థానాలు ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా అధిష్టానం ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.
రంగంలోకి బుజ్జగింపుల టీమ్
అధిష్టానం ప్రకటించిన 45 స్థానాల్లో దాదాపు సగానికి పైగా స్థానాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల టీమ్ ను రంగంలోకి దింపింది. జానారెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఫోర్ మెన్ కమిటీ ఇప్పటికే కొంత మంది అసంతృప్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినట్లు సమాచారం. టికెట్ ఇవ్వకపోవగానికి గల అనివార్య కారణాలను వివరిస్తూనే భవిష్యత్ లో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చెబుతు సర్దిచెబుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్న డీకే శివకుమార్ బస్సు యాత్ర నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఆయనకు తెలంగాణ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అసంతృప్తులను సర్దిచెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కేసీఆర్ ను గద్దెదించే వ్యూహంతో పని చేయకపోతే పార్టీకి ఎదురయ్యే నష్టాలను వివరిస్తూ నేతల భవిష్యత్ కు హామీ ఇచ్చే ప్రయత్నాలకు అధిష్టానం తెరలేపినట్లు తెలుస్తోంది. మరి పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? అసంతృప్తు నేతల్లో ఎంత మంది పార్టీలో కొనసాగుతారు? మరెంత మంది రెబల్ గా పోటీ చేస్తారు అనేది వేచిచూడాలి.
సెకండ్ లిస్ట్ పై అసంతృప్త నేతలు:
జూబ్లీహిల్స్: విష్ణువర్ధన్‌రెడ్డి
హుజురాబాద్: బల్మూరి వెంకట్
అంబర్‌పేట: లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్
ఎల్లారెడ్డి: సుభాష్‌రెడ్డి
ఎల్‌బీ నగర్: మల్‌రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్
హుస్నాబాద్: ప్రవీణ్‌రెడ్డి
సిద్దిపేట: భవానీరెడ్డి
ఆదిలాబాద్: గండ్రత్ సుజాత, షాజీద్ ఖాన్
ఆసీఫాబాద్: సరస్వతి
మక్తల్: ఎర్ర శేఖర్
వనపర్తి: శివశంకర్‌రెడ్డి, మేఘారెడ్డి
మహబూబాబాద్: బలరాం నాయక్
పరకాల: గాజర్ల అశోక్
మునుగోడు: పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డి, పొన్న కైలాష్
పినపాక: సూర్యం
వరంగల్ వెస్ట్: జంగా రాఘవరెడ్డి
మహేశ్వరం: పారిజాతారెడ్డి