తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు కీలక ఆదేశాలు
కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థులకు సూచించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థులకు సూచించారు. కాంగ్రెస్ అభ్యర్థులు, పార్టీ ముఖ్యనేతలతో శనివారం రాహుల్ గాంధీ నిర్వహించి వర్చువల్ సమావేశం ముగిసింది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు రాహుల్ గాంధీ సూచించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వైఖరిపై రాహుల్ గాంధీ అభ్యర్థులు, నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులతో పాటు ఏఐసీసీ కేటాయించిన పరిశీలకులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడైనా సమస్యలు ఉంటే స్పందించడానికి పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.
హైదరాబాద్‌కు రావొద్దు:
కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ టచ్ లోకి తీసుకుంటున్నారన్న సమాచారంతో అభ్యర్థులంతా హైదరాబాద్ కు రావాలని పీసీసీ నేతలు ఆదేశాలు జారీ చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం అభ్యర్థులెవరిని హైదరాబాద్ కు పిలవొద్దని సూచించినట్లు తెలుస్తోంది. అలా పిలవడం అంటే వారిపై అనుమానించినట్లే అవుతుందని దాని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అందువల్ల వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దే ఉండాలని సూచించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ సూచనలతో హైదరాబాద్ రావాలని పిలిచిన అభ్యర్థులను రావొద్దని పీసీసీ నేతలు మళ్లీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని సునీల్ కనుగోల్ టీమ్ రాహుల్ గాంధీకి వివరించినట్లు సమాచారం.